తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో ఇప్పుడు అంతా ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్ధమవుతున్నాయి. ఇదే అదునుగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుంది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ – కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సిద్ధమవుతున్నాయి. ఈ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 20 సీట్ల వరకు దక్కవచ్చని తెలుస్తుంది. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో అయితే చంద్రబాబు 25 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇస్తే 250 కోట్ల రూపాయలు ఇవ్వడానికి బేరం కుదుర్చుకునే పనిలో ఉన్నాడని సంచలన కథనం ఇచ్చింది. ఏదైతేనేం కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ కలసి నడవడానికి సిద్ధమైంది.

ఇక తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేయడానికి ఎవరు ముందుకు వస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అన్ని తానై, సినిమా పరిశ్రమతో ఉన్న సత్సబంధాలు, నందమూరి కుటుంబాన్ని అలా అలా ప్రచార సభలలో వాడుకుంటూ వచ్చారు. ఇక 2009 ఎన్నికల తరువాత ఎన్టీఆర్ తో తెలుగుదేశం పార్టీకి వచ్చిన మనస్పర్థలకు 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్, మోదీ చరిష్మాతో నెట్టుకువచ్చారు.

కానీ ఇప్పుడు ఆ ఇద్దరు చంద్రబాబుకి తోడు లేరు, చంద్రబాబుకి అర్జెంటు గా చరిష్మా గల నాయకుడు కావాలి, అతనితో ఎన్నికల ప్రచారానికి వెళ్లి మరలా తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రాంతంలో రెపరెపలాడించాలని ఉత్సాహంగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చేత తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయించవచ్చని ఊహాగానాలు వినపడుతున్నాయి. దీని కారణాలు కూడా తెలుగుదేశం సభ్యులు చాల చెబుతున్నారు. మొన్న హరికృష్ణ అకాల మరణంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయిన నందమూరి కుటుంబానికి అన్ని తానై హరికృష్ణ దహనసంస్కారాలు ముగిసే వరకు చంద్రబాబు అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షించారు.

NTR Chandrababu Naidu

ఆ సమయంలో కొంత జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు దగ్గరయేందుకు ప్రయత్నించారని వార్తలు వినపడుతున్నాయి. ఎన్టీఆర్ కు కూడా తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడి పదవి ఇవ్వాలని ఇప్పటికే తెలుగుదేశంలో ఒక వర్గం నాయకులు చర్చకు తెరతీశారు. ఎన్టీఆర్ కు ఒక వర్గం కోరుకున్నట్లే పొలిట్ బ్యూరో పదవి ఇచ్చి, తెలంగాణ ప్రాంతంలో ఎన్టీఆర్ తో ప్రచారం చేయించవచ్చని ఊహాగానాలు వినపడుతున్నాయి.

తెలుగుదేశం వర్గాలు మాత్రం ఎన్టీఆర్ తో ఇంకా సంప్రదింపులు జరపలేదని, నారా లోకేష్ తెలంగాణ బాధ్యతలు స్వీకరించి పార్టీ గెలుపుకై కృషి చేస్తారని చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ కనుక లైమ్ లైట్ లోకి వచ్చి ప్రచారం చేస్తే నారా లోకేష్ ను పట్టించుకునే నాధుడే ఉండడు. మరో సారి ఎన్టీఆర్ కు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని, రాబోయే తరంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్టీఆర్ అని  అభిమానులు గొడవ చేసే అవకాశం ఉంది.

చంద్రబాబు తన కొడుకుని కాదని, మరొకరిని తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకునే అవకాశం ఉండదు. ఎన్టీఆర్ తో ప్రచారం చేయిస్తే తెలుగుదేశం పార్టీకి ఎంత ఊపు వస్తుందో, అదే రీతిలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కాబోయే ముఖ్యమంత్రి అని మరో సారి చర్చకు అవకాశమిచ్చినట్లు ఉంటుంది. దీనితో చంద్రబాబు ఎన్టీఆర్ తో ప్రచారం చేయిస్తారా లేక, నారా లోకేష్ తోనే పని కానిచ్చేసి ఎన్టీఆర్ ను మరి కొన్ని రోజులు పక్కన పెడతారా అనేది త్వరలో తేలనుంది.