జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగష్టు 15 సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన 12 హామీలలో రెండు హామీలను మాత్రమే తీసుకుంటే ఆ రెండు హామీలే ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం అతని రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచితే ఆ 50 రూపాయలు తమ ప్రభుత్వమే భరిస్తుందని ప్రజలపై ఆ భారాన్ని పడనియ్యమని మాజీ ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుతం 50 రూపాయలను భరించడానికే ప్రభుత్వ సొమ్ము ప్రజల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవలసి వచ్చింది. కానీ అప్పట్లో రాజశేఖర్ రెడ్డి తీసుకున్న ఆ నిర్ణయం ప్రజలలో వైఎస్ పలుకుబడిని బాగా పెంచింది.

రెండు రాష్ట్రాలు కలిసి ఉన్న రోజులలో ఆదాయ వనరులు అధికంగా ఉన్న సమయంలోనే 50 రూపాయలు భరించడానికి ప్రభుత్వం ఒక రకంగా అష్టకష్టాలు పడి ఎలాగోలా లాకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఏకంగా వంట గ్యాస్ ని తాము అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తానని చెప్పడంతో రాజకీయ నాయకులతో పాటు, సామాన్యుడు కూడా నోళ్లు వేళ్ళబెట్టి చూస్తున్నారు. ఇక రెండో పథకంగా రేషన్ బియ్యానికి బదులు ప్రజలకు 2500 రూపాయల నుంచి 3000 రూపాయలు నేరుగా వారి అకౌంట్ లో డిపాజిట్ చేస్తానని చెప్పడం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో నాలుగు సంవత్సరాల సావాసం తరువాత తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నగదు బదిలీ పధకాన్ని రేషన్ అనే పేరుతో మర్చి  ప్రకటించినట్లు తెలుస్తుంది.

2014 ఎన్నికల హామీగా తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులకు నెలకు 2000 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నాలుగు సంవత్సరాలుగా తాత్సారం చేసి, ఎన్నికల ముందు హడావిడిగా ఒక నాలుగైదు నెలలు ఒకొక్క నిరుద్యోగికి వెయ్యి రూపాయల వంతున నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించారు. కానీ ఆ పధకం ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రతి కుటుంబానికి రేషన్ బదులు సుమారు 2500 రూపాయలు ఇస్తానని చెప్పడం చూస్తుంటే అసలు రాష్ట్ర బడ్జెట్ మీద పవన్ కళ్యాణ్ కు అవగాహనా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

సీఎం పదవిపై ఆశ లేదని చెప్పే పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్ది నమ్మశక్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను బుట్టలో వేసుకొని సీఎం సీటుపై కూర్చోవాలని ఉబలాటపడుతున్నట్లు ఉంది. గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కూడా నమ్మశక్యంగాని ఆరు వందల హామీలు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత హామీలన్నీ తుంగలో తొక్కి కొత్త రాష్ట్రం, పేద రాష్ట్రం అంటూ ఏవేవో కల్లబొల్లి కథలు చెబుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను పాతాళానికి తొక్కేసి, 2019 ఎన్నికలలో మాకు ఓటు వేస్తే అంటూ మరో కొత్త కొత్త హామీలతో ప్రజల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

వైఎస్ జగన్ కూడా పాదయాత్రలో ప్రతి వర్గానికి హామీలు ఇచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. కానీ జగన్ ఇచ్చే హామీలు మరీ అంతలా వేల కోట్లు కాకపోయినా, ప్రతి వర్గానికి ఏదో ఒక సహాయం చేస్తానని హామీ ఇస్తున్నారు. దీనిపై వైఎస్ జగన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెబుతూ తాను ఇచ్చిన హామీలు ప్రభుత్వంపై అంత ఎక్కువ భారం పడదని, సంవత్సరానికి లక్ష కోట్ల బడ్జెట్ ప్రవెశపెడుతున్న ఈరోజులలో నేను ఇచ్చే హామీలు ఏమంత ఎక్కువ కాదని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇదే విధముగా పవన్ కళ్యాణ్ కూడా తాను ఇచ్చిన 12 హామీలలో కనీసం ఆ రెండు హామీల గురించైనా స్పష్టత ఇచ్చి, ఆ రెండు హామీల వలనే సంవత్సరానికి ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

ఇలా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులూ సీఎం సీటుపై కన్నేసి ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చుకుంటూ పోయి, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసి, రాజకీయ పార్టీలు ప్రకటించే ఈ పథకాలకు ఉక్కపోతకు గురై ఏపార్టీకి ఓటు వేయాలో తెలియక చివరకు ప్రజలు నోటాకు వేసినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీ,లు ఇచ్చే హామీలు నమ్మశక్యంగా ఉండాలి తప్పా నిద్రలో కలవచ్చిన హామీలల్లా ఇచ్చుకుంటూ పోతే ప్రజలలో చులకనభావం ఏర్పడి చీ కొట్టే పరిస్థితులు వస్తాయి.