హైదరాబాద్ ప్రస్తుతం దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉందని.. త్వరలోనే మూడవ స్థానానికి చేరుతుందన్నారు తెరాస మంత్రి కేటీఆర్. శుక్రవారం ఎల్బీనగర్‌ పరిధిలోని కామినేని కూడలి వద్ద రూ.49కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ వాసుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని తెలియజేసారు. అలాగే రాజధానిలో జరుగుతోన్న అభివృద్ధి పనులు నగరాన్ని 2030 నాటికి మెగాసిటీగా ఆవిష్కృతం చేస్తాయన్నారు.

ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ మెట్రో మార్గాన్ని సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రారంబిస్తామన్న కేటీఆర్.. భవిష్యత్తులో నాగోల్‌-శంషాబాద్‌ మెట్రో మార్గం కూడా వస్తుందని.. ఎంఎంటీఎస్‌ సేవల్ని యాదాద్రి వరకు పొడిగించే రెండో దశ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కేంద్రానికి నిధి చెల్లించేందుకు సిద్ధమైందన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ బహుముఖ వ్యూహంతో నగర అభివృద్ధి ప్రణాళికలు రచించారని కేటీఆర్‌ తెలిపారు.