తెలంగాణ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటుండగానే, ఇక్కడ ఎన్నికల వేడి తగ్గకుండానే ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రత్యర్ధులు కత్తులు దూసుకుంటున్నారు. అప్పుడెప్పుడో 2009లో ప్రజారాజ్యం పెట్టిన కొత్తలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో 294 సీట్లలో 292 సీట్లు గెలవబోతున్నామని, ఆ రెండు సీట్లు ఒకటి రాజశేఖర్ రెడ్డికి, మరొకటి చంద్రబాబు నాయుడుకి వదిలేస్తున్నామని చెప్పి సంచలనం సృష్టించారు. కట్ చేస్తే ఆ ఎన్నికలలో ప్రజారాజ్యం బొక్కబోర్లా పడి 18 సీట్లకు సరిపెట్టుకుంది. తరువాత రోజులలో ప్రజారాజ్యం పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో కలిపి చేతులు దులుపుకున్నారు.

అదే ఏడాది తనకు ఎన్నికల బరిలోకి దిగుతున్నానని మత ప్రబోధకుడు కేఏ పాల్ “ప్రజాశాంతి” పార్టీ ఏర్పాటు చేసి తానే కాబోయే సీఎం అని చెప్పి చిరంజీవిని కలుస్తానని చిరంజీవిని సీఎం చేస్తానని ఎన్నెన్నో కబుర్లు చెప్పి చివరకు తాను కనీసం నామినేషన్ వేయకుండా వెనుక నుంచి పారిపోయాడు. కట్ చేస్తే సరిగ్గా 10 సంవత్సరాల తరువాత మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చి వచ్చే ఎన్నికలలో తానే సీఎం అని అవసరమైతే పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తానని, నన్ను పవన్ కళ్యాణ్ వచ్చి ఒక్కసారి కలిస్తే తాను కోరుకున్న పదవి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నానని రోజుకొక మీడియాకు వెళ్లి ఇంటర్వ్యూ లు ఇస్తూ తెలుగు ప్రజలకు మంచి కామెడీ అందిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఇదే పాటను అందుకున్నారు. గతంలో వైఎస్ జగన్ తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని భరోసా ఇస్తున్న క్రమంలో, సీఎం అయితేనే మంచి చేయాలా లేకపోతే చేయకూడదా అని వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు తాను కూడా సీఎం అయిన తరువాత మీ అందరి బాధలు తీరుస్తానని, ఒక్కసారి అందరూ సీఎం, సీఎం అని నినాదాలు చేయండని వెళ్లిన చోటల్లా అభిమానులతో సీఎం సీఎం నినాదాలు చేయించుకొని తృప్తి పడుతున్నారు.

ఇక మిగిలింది ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… వారితో పాటు వీరిద్దరూ కూడా 2019 ఎన్నికలలో సీఎం కావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికలలో వైసిపి అధినేత వైఎస్ జగన్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి చంద్రబాబు నాయుడు + పవన్ కళ్యాణ్ + బిజెపి పార్టీలను ఎదిరించి కొద్దిలో ముఖ్యమంత్రి పదవిని దూరం చేసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితులలో సీఎం పదవిలో కూర్చోవాలని సంకల్పించి నాలుగునర్ర సంవత్సరాలుగా అలుపెరగకుండా ప్రత్యేక హోదా, అమరావతి రైతుల కష్టాలు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలలో ఢిల్లీ లెవెల్ లో ఉద్యమాలు చేసి కార్యకర్తలలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసి, గత ఎన్నికలలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు కదలుతున్నారు.

చంద్రబాబు నాయుడు కూడా మరోసారి సీఎం స్థానంలో కూర్చుని, తన కొడుకు లోకేష్ బాబుకి పట్టం కట్టి, తాను జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని అభిలషిస్తున్నారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అవినీతి తార స్థాయికి చేరడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి కాస్త దూరంగా జరిగి వైసిపి పార్టీకి దగ్గరగా జరుగుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గత నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడుతో అంటకాగి ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు నుంచి బయటకు వచ్చానని, తనను సీఎం చేయాలని ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తానని చెబుతూ ముందుకు సాగుతున్నారు.

నాయకులు అందరు వచ్చే ఎన్నికలలో తామే సీఎం అని మీడియా సాక్షిగా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెబుతుంటే, మరో వైపు ఐదు సంవత్సరాలు ప్రజలకు కనపడకుండా, ఎన్నికల వేళ ఇంటింటికి తిరిగి తమ నాయకుడిని గెలిపించాలని, తమ పార్టీ నేత సీఎం అయితే వరాల జల్లు కురిపిస్తాడని చెబుతూ నాయకులంతా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో సీఎం స్థానాల్లో కూర్చునే నేత ఎవరో… సీఎం సీఎం అనే నినాదాలు తమ కార్యకర్తల నేత ఏ పార్టీ నాయకుడు చేయించుకుంటాడో చూడాలి.