బండ్ల గణేష్ ఈ పేరు సినిమా ప్రేక్షకులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే బండ్ల గణేష్ నా దేవుడు, నా గురువు, నేను అతని కోసం ప్రాణమిస్తా ఇలాంటి ఎన్నో కబుర్లు చెబుతూ పవన్ అభిమానుల చేత ఎప్పుడు ఆహా ఓహో అనిపించుకుంటూ ఉంటారు. కానీ బండ్ల గణేష్ వ్యవహారం చూస్తుంటే ఎవరని ఎక్కడ, ఎలా, ఏవిధముగా వాడాలో అతనికి తెలిసినంత ఎవరకి తెలియదు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా “గబ్బర్ సింగ్” నిర్మించేటప్పుడు చేసిన హడావిడి అంతా ఇంత కాదు, అదే హడావిడి తరువాత కాలంలో ఎన్టీఆర్ తో సినిమా చేసే సమయంలో కూడా చేసాడు.

మొన్నీ మధ్య బండ్ల గణేష్ మరలా లైమ్ లైట్ లోకి వచ్చి వైసిపి ఎమ్మెల్యే రోజా మీద విరుచుకుపడుతూ మా దేవుడు పవన్ కళ్యాణ్ ను ఏదైనా అంటే ఊరుకునేది లేదని హడావిడి చేసాడు. అప్పుడు పవన్ అభిమానులు పవన్ నిజమైన అభిమాని బండ్ల గణేష్ అంటూ మరోసారి ఆకాశానికి ఎత్తేసారు. ఇక బండ్ల గణేష్ తన దేవుడు జనసేన పార్టీలో ఎప్పుడు చేరమంటే అప్పుడు చేరడానికి సిద్ధమని ప్రకటనలు గుప్పిస్తూ చాల సార్లు మీడియాలో హడావిడి చేసాడు.

Bandla Ganesh

సడన్ గా ఏమైందో ఏమో గాని ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించుకొని ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వినపడుతుంది. ముందే చెప్పుకున్నట్లు బండ్ల గణేష్ వాడకం అలానే ఉంటుంది, పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో చేరి ఒక వెలుగు వెలగాలని ఉబలాటపడిన గణేష్ కు పవన్ కళ్యాణ్ అసలు వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాడా చేయడా అనే క్లారిటీ రాక సతమతమైనట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా నాలుగు రోజులు ప్రజల మధ్యలో ఉంటె, నెల రోజులు ఇంటికి పరిమితమవుతారు. అలాంటి పార్టీ నుంచి నిలబడి గెలవడం కష్టమని భావించి, తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

మీడియా వారు మీరు పవన్ కళ్యాణ్ అభిమాని కదా ఎందుకు జనసేనలో చేరకుండా కాంగ్రెస్ లో చేరారని అడిగితే వింత సమాధానం బండ్ల నుంచి వచ్చింది. తనకు కాంగ్రెస్ పార్టీ చిన్నప్పటి నుంచి ఇష్టమని అందుకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. పవన్ కళ్యాణ్ నాకు తండ్రితో సమానమని మరో సారి పవన్ కళ్యాణ్ పై తన ప్రేమ వెళ్లబుచ్చి పవన్ తో టచ్ లోనే ఉన్నట్లు బిల్డ్ అప్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ను గట్టిగా వాడాలని ప్రయత్నించిన బండ్ల పవన్ దెబ్బకు తన చిరకాల కోరిక ఎమ్మెల్యే పదవి తీరేలా లేదని ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.