వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు స్మగ్లర్లకే డాన్‌ అని.. ఆయన స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు. నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చే యత్నం చేస్తున్నారన్న ఆయన.. ప్రమాదానికి గురైన కారులో టిడిపి వారు ఉన్నారన్నారు. పలు హత్య కేసులలో టిడిపి ఎమ్మెల్యే ఆంజనేయులుకు సంబందం ఉందని.. అక్రమంగా స్మగ్లింగ్ చేసి వేల కోట్లు సంపాదించాడని ఆయన అన్నారు. హత్య రాజకీయాలు చేసిన ఆంజనేయులు వచ్చే ఎన్నికలలో ఓడిపోతానన్న భయంతో ఎలాంటి మచ్చ లేని నాపై ఆరోపణలు చేస్తున్నారన్నారు బొల్లా.

తనపై హత్య కేసు బనాయించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడన్న ఆయన.. ఈ మేరకు పోలీసులపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఈ కేసును విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు ముగ్గురిని చంపినట్టు వినుకొండలో ప్రచారం జరుగుతోందని.. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం అన్నారు బొల్లా బ్రహ్మనాయుడు.