అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిషత్తులో తీవ్ర పరిణామాలు ఎదర్కోవలసి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రోజు అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన.. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి బీటీ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. అనంతపురం జిల్లాను కరవు నుంచి దూరం చేసేందుకు భాగంగా లక్ష నీటి కుంటలు పూర్తి చేయడం, 5లక్షల ఎకరాలకు బిందు, తుంపర సేద్య పరికరాలు అందించామని చెప్పారు.

విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలోకి తీసుకురావాలని తాము ఎంతో కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఓ దశలో బీజేపీ దేశవ్యాప్తంగా రెండు సీట్లకే పరిమితమైన సమయంలో.. ఎన్టీఆర్‌ హయాంలోని టీడీపీ 35 సీట్లతో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందని.. తమ పార్టీ సత్తా అలాంటిదని గుర్తుచేశారు. ప్రధాని మోడీ కంటే సీనియర్ రాజకీయ వేతనయినా నన్ను పట్టుకొని మెచ్చుర్టీ లేదని పార్లమెంట్లో మాట్లాడడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు చంద్రబాబు.