ఈ రోజు కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రాబిరుద్ది కోసం ఎన్ని విమర్శలైన భరిస్తానని అన్నారు. పరిణితి లేని నాయకుడినంటూ తనను పార్లమెంట్‌లో ప్రధాని మోడీ అవమానించారన్న ఆయన.. త్వరలోనే ఆయనకు తగిన విధంగా సమాధానం చెబుతానన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసేవారిని వదిలిపెట్టేది లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళుతున్న ఏపీని కుట్ర రాజకీయాలతో దెబ్బతీయాలని కేంద్రం చూస్తోందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రానికి వైసీపీ, జనసేన పార్టీ సహకరిస్తూ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీ కంటే మేటి రాజధాని నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చి మోడి మాట తప్పారన్న ఆయన.. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు సాధించగలిగితే అన్యాయం చేసిన వారికి బుద్ది చెప్పగలమని అన్నారు. అలాగే కేంద్రం నుంచి రావాల్సినవన్నీ వడ్డీతో సహా రాబడతామని స్పష్టంచేశారు చంద్రబాబు.