చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ప్రాంతాలలో ప్రభుత్వం తరుపున చెక్కులు పంపిణి చేసారు. ఈ సందర్భంగా పలాసలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పక్క జిల్లాలో పాదయాత్రలు చేసిన జగన్ కు శ్రీకాకుళంలో తుఫాను బాధితులను పరామర్శించే తీరిక లేదా అని అంటూ మరో సారి కోడి కత్తి వ్యవహారం గురించి మాట్లాడారు.

కోడి కత్తితో వ్యవహారంపై ఢిల్లీ వెళ్లిన వైసిపి నేతలు తుఫాను బాధిత ప్రాంతాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని, కోడి కత్తి అంతా ఒక డ్రామా అని, అసలు ఎయిర్పోర్ట్ లో గొడవ జరిగితే తమకేమిటి సంబంధం అని బాబు ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం ప్రాంతంలో చాల అన్యాయం జరిగిందని అంటాడని, అలాంటప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, కేంద్రాన్ని ప్రశ్నించాలన్న బాధ్యత లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.      

వైసిపి నాయకుల కౌంటర్

తుఫాను బాధిత ప్రాంతాలలో వైఎస్ జగన్ సందర్శించకపోయినా తమ పార్టీ సభ్యులు మొదటి రోజు నుంచి ఆ ప్రాంతంలో కలియ తిరుగుతూ, వైసిపి పార్టీ తరుపున నిత్యావసర సరుకులు అందచేశారని, వైఎస్ జగన్ వెంటనే తుఫాను బాధిత ప్రాంతాల కోసం పార్టీ తరుపున కోటి రూపాయలు విరాళం ప్రకటించగా రెండు రోజుల క్రితం కోటి రూపాయలకు సరిపడిన 10 వేల కుటుంబాలకు కిట్లు అందచేసారని వైసిపి నాయకులు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ లో సంఘటన జరగకపోతే ఇప్పుడు వైఎస్ జగన్ వరద ప్రాంతాలలో పర్యటన కొనసాగేదని, కోడి కత్తి అంటూ ముఖ్యమంత్రి వ్యంగ్యంగా మాట్లాడటం పద్ధతి కాదని వైసిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.