గత కొంత కాలంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో అప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడుకి అధిక ప్రాధాన్యత దొరుకుతుంది. అంతే కాకుండా చంద్రబాబు చెప్పిన సూచనలను తూచా తప్పకుండ పాటించడంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముందు వరుసలో ఉన్నారు. ఇక రోజువారి పత్రికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలలో కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సమానంగా చంద్రబాబు నాయుడు ఫోటోలు ముద్రణ జరుగుతుంది.

ఈ ఫోటోలలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు కూడా చిన్నగా ముద్రిస్తూ చంద్రబాబు ఫోటోలు పెద్దవిగా వేస్తూ ప్రచురణ చేస్తున్నారు. కానీ ఈరోజు ఇచ్చిన ప్రకటనలలో ఏకంగా చంద్రబాబు నాయుడు ఫోటోలు కనిపించకుండా పోయాయి. కారణం ఏమిటా అని వెతికితే ఇప్పటికే చాల చోట్ల కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుని నెత్తిన పెట్టుకొని భజన చేస్తుందని, కొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడంతో పాటు, ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని, కాంగ్రెస్ చేస్తున్న పనులు తమకు నచ్చడం లేదని అనడంతో ఎన్నికల వేళ కావాలనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది.

ఇక రేపు పోలింగ్ రోజు కూడా ప్రకటనలు ఇచ్చుకునే అవకాశం ఉండటంతో కనీసం రేపైనా ప్రకటనలలో చంద్రబాబు ఫోటోలు ప్రచురిస్తారో లేక ఎత్తేస్తారో చూడాలి. ప్రజలలో వస్తున్న మార్పులను గమనించే చంద్రబాబు ఫోటో లేకుండా ఈరోజు ప్రకటనలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. చంద్రబాబు ఫోటో ప్రచురించడం వల్ల నష్టం వస్తుందని తీసేసిన కాంగ్రెస్ పార్టీ అదే చంద్రబాబు నాయుడుని కూటమిలో నుంచి బయటకు పంపించే సాహసమైతే చేయదు. కారణం ఆర్థికపరమైన కారణాలు కావచ్చు, ఇంకా లోపాయికారి ఒప్పందాలు ఏవైనా కావచ్చు. చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చాల అవసరం ఏర్పడి ఉంది. చంద్రబాబు నాయుడుకి కూడా కాంగ్రెస్ పార్టీతో అలాంటి అవసరం ఉండటంతో ఎవరకి కావలసినట్లు వారు రోజుకొక రూపంలో రంగులు మారుస్తూ ప్రజలను ఆకట్టుకొనే పనిలో బిజీ బిజీగా ఉన్నారు.