తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగునర్ర సంవత్సరాలుగా ఒక్క మైనారిటీ నేత కూడా మంత్రి వర్గంలో లేకపోవడం సిగ్గు చేటు. దీనిపై ఇప్పటికే అన్ని పక్షాల నుంచి విమర్శలు వచ్చినా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే నీకే మంత్రి పదవి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు మైనారిటీ శాసనసభ్యులను టిడిపిలో చేర్పించుకున్నారు. వారు చేరి ఇప్పటికే రెండున్నర్ర సంవత్సరాలు అవుతున్నా చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మంత్రి ఆపదవి ఇవ్వకపోగా, ఇప్పుడు వారిద్దరిని కాదని నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఫరూఖ్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఇక గిరిజన మంత్రి పదవిని కూడా వైసిపి పార్టీలో గెలిచి తెలుగుదేశంలోకి పిరాయించి… గత నెలలో మావోయిస్టుల చేతిలో హత్య గావించబడిన కిడారి సర్వేశ్వర రావు కుమారుడికి అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తుంది. ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు చంద్రబాబు నాయుడు మైనారిటీ నేత, గిరిజన నేతలకు మంత్రి పదవులు ఇవ్వకుండా ఇప్పుడు ఓట్ల కోసం హడావిడిగా మంత్రి వర్గ విస్తరణ పేరుతో వారిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు లీకులు వదిలి మైనారిటీ ప్రజలను, గిరిజన ప్రజలను తన బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని ఆశపడి వైసిపి నుంచి పిరాయించిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తో పాటు కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా లకు హ్యాండ్ ఇచ్చాడనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారిద్దరూ చివరి ఆరునెలల్లో అయినా మంత్రి పదవి మోజు తీర్చుకుందాం అనుకుంటుంటే ఆ పదవిని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అయిన ఫారూఖ్ ఎగరేసుకొని పోవడంతో కక్కలేక, మింగలేకుండా ఉన్నారు. చంద్రబాబు ,మార్క్ రాజకీయంలో సమిధలుగా మిగలడం తప్ప చేసేదేమి లేదని ఇప్పటికైనా గ్రహించారో లేదో.