కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. లోక్ సభ ఎన్నికలలో అనుసరించవలసిన వైఖరిపై వారు చర్చించారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ కలసి పోటీ చేసే అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. సుమారు గంట పాటు రాహుల్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ను, ఇతర పార్టీలను పరిగణనలోకి తీసుకోకుండా సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకున్న అంశం చర్చకొచ్చినట్టు చెబుతున్నారు.

ఈ భేటీ అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చంద్రబాబును ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కలిశారు. ఆయనతో కలసి బోజనం చేసారు. తర్వాత శరత్ పవర్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. శరద్‌ పవార్‌తో సమావేశానంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న కోల్‌కతాలో జరిగే ర్యాలీకి హాజరు కావాలని తాము నిర్ణయించినట్టు తెలిపారు. యూపీలో కాంగ్రెస్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఎస్పీ, బీఎస్పీ సొంతంగా సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నాయి కదా! అని ఓ విలేకరి ప్రశ్నించగా.. రాష్ట్రాల స్థాయిలో ఆయా పార్టీలు తమ అవసరాలకు అనుగుణంగా పోటీ చేసుకుంటాయని.. జాతీయ స్థాయిలో కలసి పని చేసేలా తాము ప్రయత్నిస్తామని బాబు తెలిపారు.