మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరం అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. చాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి అప్పటి నుంచి ఆ పార్టీ నేతగానే కొనసాగుతున్నారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. రాజ్యసభ ఎంపీగా పదవీకాలం ముగిసనప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చిరు.. త్వరలో పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుగుతారని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాల పరిమితి ముగిసనప్పటికీ దాన్ని చిరు పునరుద్ధరించుకోలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారనేందుకు ఇదే సంకేతమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

2008 లో ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరు.. తర్వాత 2009లో జరిగిన జనరల్ ఎన్నికలలో తిరుపతి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యంని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. ఖైదీ నం.150 తో సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కుతున్న సైరా సినిమాలో నటిస్తున్నారు. ఇకపై కూడా వరుసబెట్టి సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే రాజకీయాలకు కాంగ్రెస్కు పూర్తిగా గుడ్బై చెప్పేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తిరిగి రంగంలోకి దిగాల్సిందిగా చిరంజీవిని స్వయంగా రాహుల్ గాంధీ కోరారని.. అయినా చిరంజీవి స్పందించలేదని సమాచారం. దీంతో చిరు కాంగ్రెస్ కు పూర్తిగా దూరమైనట్లేనని తెలుస్తోంది.