వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత వైఎస్ కుటుంబంపై కాంగ్రెస్ అధిష్టానం పన్నిన కుట్రలకు కాంగ్రెస్ పార్టీలో బారి చీలికలు వస్తే, రాష్ట్ర విభజనతో పూర్తిగా భూస్థాపితమైపోయింది. వైఎస్ కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వైఎస్ ప్రాణమిత్రుడు కేవీపీ పార్టీ మారకుండా అదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వైఎస్ తనయుడు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ స్థాపించినా అటు వైపు చూడకుండా మొదటి నుంచి నమ్ముకున్న పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు.

మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు కలసి వచ్చే ఎన్నికలలో పొత్తు పెట్టుకొని కలసి పనిచేయాలన్న నిర్ణయంతో ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి తక్షణం రాజీనామా చేసి బయటకు వచ్చారు. మరో మాజీ మంత్రి కడప జిల్లా నేత సి రామచంద్రయ్య కూడా చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని అసహ్యించుకొని బయటకు వచ్చేసారు.

ఇక మిగతా వైఎస్ మిత్రులు, వైఎస్ నీడలో కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన నేతలు కూడా ఈ పొత్తుని ఎట్టి పరిస్థితులలో అంగీకరించే పరిస్థితి లేదని చెబుతున్నారు. వైఎస్ ఆప్తమిత్రుడు కేవీపీ కూడా తన సహచరుల దగ్గర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. వైఎస్ చనిపోయిన తరువాత ఎంత మంది తనను ఇబ్బంది పెట్టినా వైఎస్ జగన్ వెంట నడవకుండా కాంగ్రెస్ పార్టీ మారకుండా నమ్ముకొని ఉన్నందుకు తగిన శాస్తి చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారని తెలుస్తుంది.

YSR Family Program

కేవీపీ రామచంద్ర రావు కాంగ్రెస్ పార్టీలో ఉండి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో కలసి నడిచే పరిస్థితి కనపడటం లేదు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వైఎస్ – కేవీపీలు కలసి ఎవరు సహకరించిన సహకరించకపోయినా కాంగ్రెస్ పార్టీని బతికించడానికి ఎంతో కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అలాంటి నేతతో ఇప్పుడు అంటకాగి చెట్టాపట్టాలేసుకొని తిరిగే ప్రసక్తే ఉండదు. వట్టి వసంత కుమార్ కూడా మొదటి నుంచి వైఎస్, కేవిపీల మనిషి కేవీపీకి తెలియకుండా వట్టి వసంత కుమార్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు. కేవీపీ కూడా తగిన సమయంలో నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెబుతారేమో అని పార్టీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. కేవీపీ కనుక కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వస్తే ఏపీ కాంగ్రెస్ పార్టీలో కాస్తో కూస్తో పేరున్న నాయకులు మొత్తం కేవీపీతో పాటు బయటకు రావడం ఖాయంగా కనపడుతుంది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీని వీడి బయటకు ఎవరైతే వెళ్లాలని అనుకుంటున్నారో వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగింపులు పర్వానికి తెరలేపనున్నారని తెలియ వస్తుంది. చూద్దాం రాబోయే రోజులలో చంద్రబాబుతో కలసి పనిచేసే కాంగ్రెస్ నాయకులు ఎవరో, చీ కొట్టి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చే నాయకులు ఎవరో తేలనుంది.