ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. ఆయన ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే. ఈ ఢిల్లీ పర్యటన తర్వాత టీడీపీ నాయకులతో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు బాబు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయన్న బాబు.. కాంగ్రెస్‌తోనూ ఇందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేకపోయిన జాతీయ స్థాయిలో ఉంటాయన్నారు. ఏపీలోని పరిస్థితుల్ని రాహుల్‌గాంధీతో వివరించి సీట్ల సర్దుబాటు సాధ్యం కాదని.. జాతీయ స్థాయిలో మాత్రం మద్దతుగా ఉంటామని చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్లోని కొంత మంది నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా బహిరంగంగానే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. పైగా టీడీపీ తో పొత్తు పెట్టుకుంటే పొత్తులో భాగంగా తనకు కర్నూల్ ఎంపీ సీటు తనకే వచ్చిద్దనే భావనలో ఉన్నారు. అలాగే రఘువీరా రెడ్డి కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

రఘువీరా రెడ్డి కాంగ్రెస్ నుండి పోటీ చేసే లిస్ట్ ను తీసుకుని రాహుల్ గాంధీని కలవడం కూడా జరిగింది. పొత్తుల సంగతి త్వరగా తేల్చాలని కోరారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో భారీ ఎదురు దెబ్బ తగలడంతో చంద్రబాబు.. సీట్ల సర్దుబాటు విషయంలో కొంత ఆలోచనలో పడ్డారు. అనేక మంది నేతల అభిప్రాయాన్ని తీసుకున్న బాబు.. చాలా మంది కాంగ్రెస్ తో పొత్తు వద్దని చెబుతుండటం విశేషం. ఈ కారణంగానే రాహుల్‌ గాంధీకి తన అభిప్రాయం చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది.