దానం నాగేందర్ కొన్ని రోజుల క్రితం తనకు హైదరాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకుండా అంజన్ కుమార్ యాదవ్ కు కట్టబెట్టారని, తనను కాంగ్రెస్ పార్టీలో పట్టించుకునే నాధుడే లేడని టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దానం నాగేందర్ టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాడని ఊహాగానాలు రావడంతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడీతో పాటు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడా బడా వృద్ధ నేతలు దానం నాగేందర్ ను బుజ్జగించే పనిలో పడ్డారు. కానీ దానం మాత్రం వెనక్కు తగ్గకుండా టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయి కేసీఆర్ పై ఎక్కడలేని ప్రేమను కురిపించాడు.

కట్ చేస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికల బరిలో దిగటంతో పాటు ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించాడు. కానీ ఇందులో దానం నాగేందర్ పేరు లేకపోవడమే ఇక్కడ పెద్ద చిక్కు వచ్చి పడింది. టిఆర్ఎస్ పార్టీ తరుపున వచ్చే ఎన్నికలలో ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలనీ దానం ఉబలాట పడ్డాడు. కానీ గులాబీ బాస్ మాత్రం దానం అంచనాలను తలక్రిందులు చేస్తూ సీటు ఇవ్వకుండా పక్కన పెట్టడంతో లోలోన దానం రగిలిపోతున్నట్లు తెలుస్తుంది.

ఈ పరిణామాలతో జీర్ణించుకోలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ లో పదవి రాలేదని టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ కొట్టిన దానం, కొన్ని నెలలు కూడా గడవకుండానే టిఆర్ఎస్ తరుపున పోటీ చేయడానికి కోరుకున్న టికెట్ రాలేదని తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడానికి ప్రయత్నించడం చూస్తుంటే దానం పరిస్థితి తలచుకుంటే జాలేస్తుంది. ఇలాంటి నేతలను నమ్ముకున్న కార్యకర్తలు ఎప్పుడు ఏపార్టీలో ఉంటామో తెలియక తలలు పట్టుకుంటున్నారు. తమ స్వలాభాల కోసం కావలసిన సమయంలో కావలసిన పార్టీలకు మారుతూ ప్రజలలో మరింత చులకనగా మారిపోతున్నారు. ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తాను కోరుకున్న టికెట్ కాంగ్రెస్ లో సాధించలేకపోతే తిరిగి మరలా ఇంకో పార్టీ వైపు దానం నాగేందర్ చూస్తాడేమో చూడాలి.