నాయకులకు ప్రజలు గెలిచిన తరువాత గుర్తు రావడమనేది జరగనే జరగదు. అలాంటిది ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే చాలు ఒక ఆరునెలల ముందుగానే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలలోకి అడుగుపెట్టినట్లు వారిచ్చే బిల్డ్ అప్ లు మాములుగా ఉండవు. ఇప్పుడు తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో నాయకులు ఎవరికి వారు తమకు నచ్చిన రీతిలో ప్రచార కార్యక్రమాలు చేస్తూ ప్రజల దృష్టిలో పడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

దీనిలో భాగంగా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాలలో ఎక్కడ చావు డప్పు మోగితే అక్కడ వాలిపోయి ఓదార్పు యాత్రలకు శ్రీకారం చుడుతున్నారు. ఇంకొంచెం ముందుకు అడుగు వేసి శవపేటికను మోసే కార్యక్రమాలలో కూడా నిమగ్నమైపోయి, తమకు ఆ కుటుంబం మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. బతికున్నప్పుడు నాకు పించెను రావడం లేదు మహాప్రభో అన్న పట్టించుకునే వాడు ఉండడు. ఈ సంవత్సరం పంట ఎండిపోయి నష్టానికి గురయ్యాను కొంత ఆదుకోండి నాయనలారా అన్న అటువైపు కనెత్తి కూడా చూడరు. తీవ్ర ఆరోగ్యానికి గురై ఆసుపత్రి పాలైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత సొమ్ము ఇప్పించాలని ఇలా నాయకుల దగ్గరకు ప్రజలు మోర పెట్టుకోవడానికి పోతే, రోజుల తరబడి వారికి అపాయింట్ మెంట్ లు ఇవ్వకుండా తిప్పించుకొనే నేతలకు ఎన్నికల సమయంలో మాత్రం చావులకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు వెళుతూ మీకు అండగా ఉండే నాయకుడిని నేనే అని చెబుతూ ప్రజలను పిచ్చోళ్లను చేసి మరో ఐదు సంవత్సరాలు నియోజకవర్గాన్ని ఫలించాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఐదు సంవత్సరాలు కనపడని నాయకుడు ఒక్క సారిగా అలా కనపడి చెయ్యి బుజం మీద వేసే సరికి ఆ ప్రజలు కూడా పొంగిపోయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా నాయకులను గెలిపించి తప్పు మీద తప్పు చేస్తున్నారు. ఎన్నికలలో గెలిచినా నాయకుడు యదా ప్రకారం కోట్ల రూపాయల సంపదను దోచుకొని వెనకేసుకోవడం పరిపాటిగా మారింది.