ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఈ మధ్యకాలంలోనే హఠాన్మరణం చెందారు. మొదట్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు పుత్తూరు నుంచి అనేకమార్లు శాసనసభకు ఎంపికయ్యారు. తెలుగుదేశం పార్టీలో విద్యాశాఖ, అటవీశాఖ వంటి మంత్రి పదవులను కూడా అనుభవించారు. తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరినా ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక తిరిగి 2008లో తెలుగుదేశం పార్టీకి తిరిగి వచ్చారు.

తెలుగుదేశం పార్టీకి తిరిగి వచ్చిన తరువాత నగరి నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికలలో రెడ్డివారి చెంగారెడ్డి మీద 1308 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో వైసిపి మహిళా నేత రోజాపై 858 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికలలో ముద్దు కృష్ణమ గెలిస్తే చంద్రబాబు కేబినెట్ లో తప్పకుండా మంత్రి పదవి దక్కేది.

Gali Muddu krishnama Naidu

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత గాలి ముద్దుకృష్ణమ నాయుడుని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చంద్రబాబు గౌరవించారు. కానీ గాలి ఈ మద్య కాలంలోనే హఠాన్మరణం చెందడంతో నగరి తెలుగుదేశం ప్రజలు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

ఇక గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణించడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి కోసం గాలి కొడుకులు గాలి భానుప్రకాష్ – గాలి జగదీశ్ ప్రకాష్ రోడ్డున పడ్డారు. ఎమ్మెల్సీ పదవి నాకు కావాలంటే నాకు కావాలని గొడవలు చేయడంతో చంద్రబాబు వారిద్దరిని పిలిచి రాజి చేసే ప్రయత్నం చేసారు. కానీ ఫలితం దక్కకపోవడంతో చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్సీ పదవిని గాలి ముద్దుకృష్ణమ నాయుడు భార్య గాలి సరస్వతమ్మకు ఇవ్వడానికి నిర్ణయించారు.

గాలి భార్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో సమస్య తీరక పోగా ఇంకా జఠిలమయ్యింది. ఇప్పుడు నగరి నియోజకవర్గ ఇంచార్జి పదవి కోసం అన్నదమ్ములిద్దరూ పోటీ పడుతున్నారు. వీరి గొడవలతో అన్నదమ్ములిద్దరూ విడిపోయారు. పెద్ద కొడుకు తల్లి, తమ్ముడు నుంచి విడిపోయి రాజకీయం చేయడం మొదలు పెట్టాడు. గాలి సరస్వతమ్మ మాత్రం వచ్చే ఎన్నికలలో నగరి నియోజకవర్గం నుంచి తన చిన్న కొడుకు పోటీ చేస్తాడని ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో పెద్ద కొడుకు వచ్చే ఎన్నికలలో నగరి నుంచి తెలుగుదేశం తరుపున నేనే పోటీ చేస్తానని ప్రకటనలు విడుదల చేస్తున్నాడు.

వీరి కుటుంబ గొడవలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమి చేయాలో పాలుపోక చంద్రబాబు నాయుడు దగ్గర మొరపెట్టుకునట్లు తెలుస్తుంది. నగరి నియోజకవర్గం నుంచి మంచి పట్టున్న అభ్యర్థిని ఎంచుకోవాలని, అప్పటి వరకు నగరి నియోజకవర్గంలో గాలి కుటుంబ గొడవలతో పార్టీలో లుకలుకలు ఆగవని తెలియచేసారు.

గాలి కుటుంబ గొడవలతో తెలుగుదేశం పార్టీలో చీలికలు కనపడుతుండటంతో వచ్చే ఎన్నికలలో వైసిపి నేత ఆర్.కే రోజా తన గెలుపు నల్లేరుపై నడకే అని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండే ఆంధ్రజ్యోతి సర్వేలో కూడా రోజా వచ్చే ఎన్నికలలో నగరి నుంచి గెలిచే సూచనలున్నాయని చెప్పడంతో రోజా మరోసారి అసీంబ్లీలో అడుగుపెట్టడం ఖాయంగా చెప్పుకుంటున్నారు. గాలి కుటుంబ గొడవలకు బాబు విసిగి అక్కడ కొత్త ఇంచార్జిని నిలబెడతాడా లేక అన్నదమ్ములిద్దరిలో ఒకరికి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం నుంచి సీటు ఇస్తారో చూడాలి.