తెలంగాణలో టిఆర్ఎస్ దే గెలుపు అని మరో సర్వే తెలిపింది.ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రి కెసిఆర్ కు మద్దతు బాగా పెరిగింది. టిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు 75% ఉన్నాయని ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు. తదుపరి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7%, అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయం.. విపక్షాలపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని, దాని నుండి ప్రతిపక్ష పార్టీలు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయాయని సర్వే సంస్థ వ్యాఖ్యానించింది. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఇప్పటికీ కుట్రదారుగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నందున, ఆ పార్టీతో కలయిక కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల తిరస్కరణకు గురయ్యే ప్రమాదముందని అత్యధికులు అభిప్రాయపడినట్లు ఈ సర్వే తెలిపింది.