ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తరువాత కుల సమీకరణలలో బాగా హెచ్చు తగ్గులు కనపడుతున్నాయి. తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మొన్న పార్లమెంట్ సాక్షిగా మీరు రాష్ట్రాన్ని రెండుగా చీల్చి మా రెడ్లను రాజకీయంగా చావు దెబ్బ తీశారు మీకొక దణ్ణం అని చెప్పి వెళ్లిపోయారు.

నిజంగానే రాష్ట్రం రెండుగా చీలిపోయాక రెడ్ల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైనది. తెలంగాణలో రెడ్ల హావ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమలో రెడ్డి స్థానాలను అధికంగా కైవసం చేసుకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఎక్కువగా సాగించేది.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అన్ని కులాలను నమ్ముకొని రాజకీయం చేయాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గోదావరి జిల్లాలో కాపుల ప్రాధాన్యత గుర్తించి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. కారణం అక్కడ కాపు ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటం. అలానే చంద్రబాబు కూడా వారినే నమ్ముకొని రాజకీయాలు నడిపేవారు.  తరువాత కాలంలో రాజశేఖర్ రెడ్డి చనిపోవడం రాష్ట్రం విడిపోవడం, ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలో కాపు ఓట్లు ఎక్కువగా ఉండటం అసెంబ్లీ సీట్లు కూడా అత్యధికంగా 34 సీట్లు ఆ ప్రాంతాల నుంచి ఉండటంతో అందరూ కాపుల జపం మొదలు పెట్టారు.

చంద్రబాబు నాయుడు ఇదే అదునుగా ఏకంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి, గోదావరి జిల్లాలో భారీగా అసెంబ్లీ సీట్లు సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక రాబోయే 2019 ఎన్నికలకు సంబంధించి మరోసారి కులాల కుంపటితో ఓట్ల రాజకీయాలు షురూ అయ్యాయి. వైఎస్ జగన్ ఏమో కాపులకు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి నా చేతిలో లేదని, కేంద్ర ప్రభుత్వం దానిపై రాజ్యాంగంలో మార్పులు చేయాలని, సుప్రీం కోర్ట్ 50 శాతం కన్నా ఎక్కువ రిజర్వేషన్ లు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చిందని క్లారిటీగా వైఎస్ జగన్  చెబుతున్నా… కాపు ఓట్లను జగన్ నుంచి దూరం చేయడానికి, జగన్ ప్రత్యర్థి పార్టీలు, పత్రికలూ జగన్ కాపు ద్రోహి అని ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా జనసేన తరుపున 175 స్థానాలలో తన అభ్యర్థులను నిలపడానికి సిద్ధమవుతున్నాడు. కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ కు గోదావరి జిల్లాలో రాజుకున్న వేడి తెలియంది కాదు. కానీ పవన్ కళ్యాణ్ ఎంత సేపటికి నాకు ఒక కులంతో సంబంధం లేదని ఎంత చెబుతున్నా… పవన్ కళ్యాణ్ కు కాపు సామజిక వర్గం పూర్తి సహకారం అందిస్తేనే రాజకీయాలు చేయగలను అని తెలుసు, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మిగతా రెండు కులాల వారు తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీలకు అండగా నిలుస్తున్నారు. అలాంటిది పవన్ తన కాపు కులానికి సంబంధించిన రిజర్వేషన్ కు పూర్తిగా మద్దతు తెలిపే దమ్ము లేదా?

పవన్ కళ్యాణ్ పై కూడా 2019 ఎన్నికలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు దృష్టిపెట్టాయంటే పవన్ కళ్యాణ్ కు ఆ కులానికి చెందిన ఓట్లను గంపగుత్తుగా సాధించి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాడేమో అన్న ప్రత్యర్థి పార్టీలకు భయం ఎక్కువగా కనపడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ పై ఇంత వేడి రాజుకుంటున్నా మాట్లాడకుండా పారిపోవడాన్ని ఏమనుకోవాలి. ఏదైనా ఒక సామజిక వర్గానికి సంబంధించిన ఒక ఇష్యూ వచ్చినప్పుడు  నాయకుడు దైర్యంగా నిలబడి నేను మీకు అండగా నిలబడతాను అని భరోసా కల్పించగలగాలి, అది రాజకీయ నాయకుని లక్షణం. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా చేతులెత్తేసి, రెండు ప్రధాన పార్టీలు ఆడుతున్న గేమ్ చూస్తూ ఉండి అసలు రిజర్వేషన్స్ అవసరమా అని మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.

అసలు పవన్ కళ్యాణ్ కు తన సామజిక వర్గానికి చెందిన కాపులకు అండగా ఉంటానని చెప్పే అడ్డం ఏమొచ్చిందో మిలియన్ డాలర్ల ప్రశ్న. పవన్ కళ్యాణ్ కాపులకు నేను అధికారంలోకి వస్తే రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పినా అడ్డు చెప్పే వారే ఉండరు. ఎందుకంటే కాపు రిజర్వేషన్ ప్రకటిస్తే వ్యతిరేకించే వర్గాలు కూడా లేవు. బిసి రిజర్వేషన్ తగ్గించకుండా వారికీ విడిగా కోట పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం సిపార్సు చేసింది.

కానీ పవన్ కళ్యాణ్ అలా చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటే తన సామజిక వర్గానికి చెందిన నేతనే మమల్ని పట్టించుకోకపోతే ఎలా అని కాపులలో కూడా ఒక ప్రశ్న తలెత్తి వచ్చే ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ పలుచన పడే అవకాశం కూడా ఉంది. దీనిపై ఇప్పటికైనా జనసేన తమ వైఖరిని ప్రకటించి మెయిన్ స్ట్రీమ్ లో ఉంటుందా లేక, ఆ రెండు పార్టీలు చేసే రాజకీయాలు చూస్తూ దూరపు కొండలు నునుపు అనేలా వ్యవహరిస్తుందో చూడాలి.