హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫై ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులఫై బాలకృష్ణ చేసిన వాక్యాలు తప్పు పడుతూ ఈసీకి ఫిర్యాదు చేసారు. చంద్రబాబును తెలంగాణలో అడ్డుకునే హక్కు తెరాసకు లేదంటూ, చంద్రబాబు కట్టిన బిల్డింగుల్లో మీటింగులు పెట్టుకుంటూ బాబునే విమర్శిస్తారా? అంటూ ధ్వజమెత్తారు.

చంద్రబాబు వచ్చాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగులు నేర్పించారని అన్నారు. ఆయన హయాంలోనే ఐటీ అభివృద్ధి చెందింది అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఐటీ ఉద్యోగుల మీద చేసిన కామెంట్లపై ఫిర్యాదు నమోదైంది. తమపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ కు ఐటీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సందీప్ ముక్తాలా మంగళవారం ఫిర్యాదు చేసారు.

దీనిపై సందీప్ ముక్తాలా మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్‌ నేర్పించామనడం హాస్యాస్పదమని అన్నారు. చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి జరిగిందని చెప్పి టెక్కీల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరో ఒకరి కృషి వల్ల ఐటీ రంగం అభివృద్ధి సాధించలేదని, ఉద్యోగుల జోలికి రాకుండా ఎవరి ప్రచారం వారు చేసుకోవాలని ఆయన సూచించారు.