ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర జనవరి 9 న ముగిసింది. ఈ సందర్భంగా ఇచ్చాపురంలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తానని.. ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా చేస్తామన్నారు. అంటే ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామన్నారు.

ప్రతి పార్లమెంటు నియజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానన్న జగన్.. ఈ మార్పు ఎందుకంటే.. ప్రతి కలెక్టర్‌ ఏడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే జవాబుదారీతనంగా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండటంతో కలెక్టర్లకు జవాబుదారీతనం లేకుండా ఉంది. ప్రజలకు కలెక్టర్‌ దగ్గరగా ఉండాలి. కలెక్టర్‌ చేతి నిండా పని ఉండేలా చేసేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు జగన్.

అలాగే ఈ మధ్య ఈనాడు పేపర్లో ఏ రోజు చూసిన చంద్రబాబు, మోడీకి యుద్ధం అని రాస్తున్నారని.. నాలుగేళ్లు చిలకా గోరింకల్లా కలసి కాపురం చేసిన వారికి ఇప్పుడు యుద్ధంలా కనిపిస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు రెండు పత్రికలూ, అనేక టీవీ ఛానెల్స్ అడ్డం పెట్టుకుని, గ్లోబెల్ ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలన్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలన్నారు. విశ్వసనీయత అనేది ఉండాలన్నారు. రేపు దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయ వ్యవస్థను మారుస్తానని అన్నారు ప్రతిపక్షనేత జగన్.

icchapuram