సంగారెడ్డి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో హరీష్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించారన్నారు. హైద్రాబాద్లో మీడియాతో మాట్లాడారు జగ్గారెడ్డి. 2008లోనే హరీష్ కాంగ్రెస్ లో కేవిపీ ద్వారా చేరేందుకు ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ను ఆయన కుటుంబాన్ని రాజకీయంగా విమర్శించానే తప్ప నాకు వ్యక్తిగతంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. తాను విభేదించేదంతా హరీశ్‌రావుతోనేనని, తనను జైల్లో పెట్టించింది ఆయనేనని ఆరోపించారు. ఉనికి కోసం హరీష్ రావు తనను బలి చేసే యత్నం చేశారని దుయ్యబట్టారు. హరీశ్‌ ఇప్పుడు తెరాస ను వీడతారని తాను అనుకోవడం లేదన్నారు.

హరీష్ రావు తో పోలిస్తే కేటీఆర్ చాలా చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించిన ఆయన… తాను కాంగ్రెస్‌ పార్టీ మారేది లేదని, అయితే నియోజకవర్గ అభివృద్ధి, సంగారెడ్డిలో మెడికల్‌ కళాశాల కోసం కేసీఆర్, కేటీఆర్‌లను కచ్చితంగా కలుస్తానని చెప్పారు. తాను తెరాస వీడినప్పటి నుంచి కేసీఆర్‌తో లోపాయికారీగా కలిసింది ఎప్పుడూ లేదని, కేసీఆర్, కేటీఆర్‌లతో తాను మాట్లాడలేదని చెప్పారు. కేసీఆర్ వల్లే తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించానన్న జగ్గారెడ్డి.. బీజేపీలో తనను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరిగిన సమయంలో కేసీఆర్ పిలిచి తనకు టిక్కెట్టు ఇచ్చారని జగ్గారెడ్డి తెలిపారు.