2014 ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్, వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన సత్తా చాటడానికి సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా అసెంబ్లీ టికెట్స్ కేటాయింపుపై ఇప్పటి నుంచే ఒక స్పష్టత ఇచ్చేందుకు అడుగులు వేస్తున్నారు. ముందుగా ఈరోజు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ టికెట్ పితాని బాలకృష్ణకు కేటాయించి జనసేన తరుపున మొదటి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది.

ముమ్మిడివరం వైసిపి మాజీ కో ఆర్డినేటర్ గా ఉన్న పితాని బాలకృష్ణ ఇటీవలే జనసేన పార్టీలో చేరాడు. గత ఎన్నికలలో ముమ్మిడివరం నుంచి తెలుగుదేశం పార్టీ తరువున దాట్ల సుబ్బరాజు వైసిపి అభ్యర్థిపై 29 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించాడు. ఇక ఇప్పుడు మొదటిగా పవన్ కళ్యాణ్ ముమ్మిడివరం నుంచి బాలకృష్ణను ఎంపిక చేయడంతో తూర్పు గోదావరి జిల్లాలో ఆ సీటుపై ఏమైనా పవన్ ఆశలు పెట్టుకున్నాడా అనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో మొదటి బీఫామ్ కూడా ముమ్మిడివరం నుంచే మొదలవుతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియచేసారు.