ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్.. ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలలో పోటీ చేసేందుకు రెడీ అవ్వుతున్నారు. పొత్తులు కుదిరితే కొన్ని స్థానాలు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారట. ఇక ప్రస్తుతం ఉన్న సర్వే బట్టి ప్రజాశాంతి పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో 79 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

విశాఖలో ఆయన భార్యతో కలసి తొలి సారిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా భార్య అలివా మేరి కిలారితో కలిసి మొట్టమొదటి సారి మీడియా సమావేశం నిర్వహిస్తున్నానని తెలిపారు. నాపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకున్న చంద్రబాబు కుట్ర సఫలీకృతం కాలేదని.. అందుకే కోర్టులో విజయం సాధించానని తెలిపారు. వచ్చే ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్న ఆయన.. ప్రస్తుత సర్వే ప్రకారం తమ పార్టీకి 79 సీట్లు వస్తాయన్నారు. బీజేపీకి 2 శాతం, జనసేనకు 5 శాతం, వైసీపీకి 15 శాతం, టీడీపీకి 18 శాతం, ప్రజా శాంతి పార్టీకి 39 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించారు.