తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి మండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసిన కెసిఆర్.. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిసి కేబినెట్ తీర్మానం కాపీని అందజేశారు.
ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ… సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఏర్పాటు చేసిన తొలి మీడియా సమావేశంలో 105 స్థానాలకు అభ్యర్థులను సీఎం ప్రకటించారు. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ అని.. సెక్యులర్‌గానే ఉంటామని.. త్యాగాలు ఎవరైనా చేశారంటే అది తామే అన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వందకు పైగా స్థానాలు గెలుస్తామన్నారు కెసిఆర్.