ఉప ముఖ్యమంత్రి కే.ఇ కృష్ణ మూర్తి గతంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ఎప్పటికి కాంగ్రెస్ పార్టీతో కలసి నడిచే ప్రసక్తే లేదని, ఒక వేళ అలా నడిస్తే ఉరేసుకుంటానని వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు. ఇక కే.ఇ కృష్ణమూర్తి నిజంగానే ఉరేసుకుంటాడని బయపడి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలవకుండా వెనక్కు తగ్గుతాడేమో అని సోషల్ మీడియాలో సెటైర్స్ పేలాయి.

ఉరి సంగతి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో కలసి చెట్టాపట్టాలేసుకున్న ఫోటోలు మీడియాలో హల్ చల్ చేశాయి. వారిద్దరి కలయిక తరువాత కే.ఇ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ కే.ఇ కృష్ణ మూర్తి ఎప్పుడు ఉరివేసుకుంటున్నాడంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.

చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలసిన తరువాత ఇప్పటి వరకు మీడియాతో మాట్లాడని కే.ఇ ఈరోజు మాట్లాడుతూ తమ అధినేత తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని, దేశంలో ప్రజాస్వామ్యం సమస్యలో పడిందని, అందుకనే చంద్రబాబు నాయుడు తన వంతు పాత్ర పోషించడానికి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడని చెప్పారు. ఇక అయితే కే.ఇ చెప్పిన ఉరి కథ ముగిసినట్లే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు దారిలోకి ఎవరైనా రావాలి తప్ప, ఎవరు ఎన్ని భయబ్రాంతులకు గురిచేసినా తాను అనుకున్నది చేసి తీరుతాడనడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం.