గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో బాధ్యతలని కొడుకు కేటీఆర్ మీద పెట్టారు. ఆ ఎన్నికలలో కేటీఆర్ 99 సీట్లను హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలలో గెలుపొందేలా చేసి అద్భుతమైన విజయాన్ని టీఆర్ఎస్ పార్టీతో పాటు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ స్థాయి మరింత పెరగడంతో పాటు, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అన్న రేంజ్ కు ఆ ఎన్నికలు తీసుకొని వెళ్లాయి.

కట్ చేస్తే 2018 సార్వత్రిక ఎన్నికల హైదరాబాద్ నగర బాధ్యతలను కేసీఆర్ తిరిగి కేటీఆర్ చేతిలో పెట్టి మరోమారు పరీక్ష పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి చెందుతుందని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, సార్వత్రిక ఎన్నికలు అంటే ప్రజలంతా వారికి నచ్చిన పార్టీలకు ఓట్లు వేస్తూ, గత ప్రభుత్వం చేసిన తపొప్పులను బేరీజు వేసుకుంటుంది. దీనితో గ్రేటర్ ఎన్నికలకు వచ్చిన ఫలితాలు పునరావృతమవుతాయని ఖాళీగా కూర్చుంటే పప్పులో కాలేయడమే. అందుకే కేటీఆర్ తనపై పెట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చారు.

ఇప్పటికే సెటిలర్స్ ఉన్న ప్రాంతాలలో వారితో మమేకమవుతూ, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో తెలియచేస్తూ వారిని ఆకట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. 2014 ఎన్నికలలో హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. కానీ అప్పటి పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఆ ఎన్నికలలో సెటిలర్స్ అంతా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేసి టీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మమల్ని హైదరాబాద్ నుండి తరిమివేస్తారని, అనేక రకాల అపోహలతో పాటు, ప్రత్యర్థి మీడియా చానెల్స్ కూడా ఆ విదమైన ప్రచారం చేయడంతో టీఆర్ఎస్ కు 2014 సార్వత్రిక ఎన్నికలలో బారి దెబ్బ తగిలింది.     

కానీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉండటంతో పాటు, ఎటువంటి ఇబ్బందులు కలగకపోవడంతో సెటిలర్స్ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం మహాకూటమి పొత్తులో భాగంగా తాను తీసుకున్న 13 సీట్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ నగరం నుంచే తీసుకొని తెలుగుదేశం సత్తా చూపించడానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎత్తులను చిత్తు చేస్తూ కేటీఆర్ సెటిలర్స్ తో మీటింగ్స్ పెడుతూ మమేకమవుతున్న విధానం చూసి టిడిపికి భంగపాటు తప్పదని అనే వారు ఉన్నారు.

చంద్రబాబు నాయుడు గత వారం రోజులుగా హైదరాబాద్ నగరమంతా సుడిగాలి పర్యటన చేస్తూ సెటిలర్స్ ను తన వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలలో కనుక కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయగలిగితే కేటీఆర్ కు ఇక టీఆర్ఎస్ పార్టీలో తిరుగుండదని చెప్పుకోవచ్చు.