తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమిదే పైచేయిగా ఉందని, ప్రజా నాడి కూటమి వైపే ఉందని లగడపాటి రాజగోపాల్ విశ్లేషించిన సంగతి తెలిసిందే. లగడపాటి సర్వేలు బోగస్‌ అని.. ఆయన ఎన్నికల తర్వాత చిలక జ్యోతిష్యాలు చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరారని కేటీఆర్ విమర్శించారు. ఈ విమర్శలపై లగడపాటి రాజగోపాల్ స్పందించారు. ఎవరో వ్యక్తులు తనపై ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని తాను కాదని.. తనకు పదవుల కన్నా వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. ఒత్తిడితో రాజగోపాల్ తప్పుడు సర్వేలు చేస్తున్నారని కేటీఆర్ చెప్పడం సరికాదన్న ఆయన.. సెప్టెంబర్‌ 16న వాట్సాప్‌లో తనకు, కేటీఆర్‌కు మధ్య సంభాషణ జరిగిందన్నారు. సర్వే విషయం మాట్లాడేందుకు కేటీఆర్‌ కామన్ ఫ్రెండ్ ఇంటి వద్దకు వచ్చారన్నారు. సెప్టెంబర్‌లో టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని అప్పట్లో తేలిందన్నారు. అప్పటికింకా కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ కలవలేదన్నారు.

కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్‌ఎస్‌కు 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారిందన్నారు లగడపాటి. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందనుకున్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చిందన్నారు. ఉదయమే రిపోర్ట్ వచ్చిందని వరంగల్ కూడా కాంగ్రెస్‌ వైపు వెళ్లిపోయిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న లగడపాటి.. రాజకీయాల్లోకి వచ్చాక గెలుపోటములకు సిద్ధపడే ఉండాలన్నారు. తనకు, కేటీఆర్‌కు మధ్య ఎలాంటి గొడవ లేదన్నారు. కేటీఆరే తన స్నేహితుడి ఇంట్లో తనను కలిసి సర్వే చేయాలని సాయం కోరారన్నారు.