పందెపు రాయుళ్ల జోరు తెలంగాణ రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఎక్కువగా కూకట్‌పల్లి నియోజకవర్గంపై పడింది. ఇక్కడ నుంచి నందమూరు హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని నిలబడటంతో అందరి చూపు ఇక్కడ ఎక్కువగా ఆసక్తి రేకెత్తిస్తుంది. నందమూరి సుహాసిని ఓటమిపైనే ఎక్కువగా పందేలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికలలో బారి మెజారిటీని తెచ్చిపెట్టిన కూకట్‌పల్లి నియోజకవర్గంపై చంద్రబాబు నాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత ఎన్నికలలో సెటిలర్స్ అంతా టిడిపి + బిజెపి + జనసేన కూటమి అభ్యర్థిగా నిలబడిన మాధవరం కృష్ణారావును 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపారు. తరువాత జరిగిన పరిణామాలతో మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆ పార్టీ తరుపున కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

గత ఎన్నికలలో అండగా నిలిచిన సెటిలర్స్ ఈ సారి తమ ఓటుని టీఆర్ఎస్ పార్టీకి వేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని సర్వేలు తేల్చేస్తున్నాయి. ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం రంగంలోకి దిగి ఏపీ మంత్రులు, సినిమా హీరోలను రంగంలోకి దింపి చుండ్రు సుహాసిని తరుపున ప్రచారం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఒక వర్గానికి చెందిన సెటిలర్స్ మాత్రమే సుహాసిని పట్ల ఆసక్తి చూపుతుండగా మిగిలిన వర్గాలన్నీ టీఆర్ఎస్ పార్టీ వైపే నిలవడం కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉంది. ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ గత శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉండే సెటిలర్స్ కోసం మీటింగ్ ఏర్పాటు చేసి వారిని ఆకట్టుకునే దిశగా పావులు కదిపారు.

తెలుగుదేశం పార్టీ… కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే కొన్ని వర్గాలు సైతం ఈ కూటమిని వ్యతిరేకించడం టిడిపికి కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు టీఆర్ఎస్ పార్టీపై గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ కోట్లలో పందేలు కాస్తున్నారు. ఈ బెట్టింగ్ లు ఎక్కువగా విజయవాడ కేంద్రంగా నడుస్తున్నాయి. చుండ్రు సుహాసిని గెలుపుపై నమ్మకాలు సన్నగిల్లడంతో ఎన్టీఆర్ ను ప్రచారం చేయించేలా చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబసభ్యులతో మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.