మహాకూటమి పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పరచుకున్న కూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, టీజెఎస్ తో పాటు సిపిఐ పార్టీ కలసి పనిచేస్తున్నాయి. ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు సమయం కూడా లేదు. కానీ ఇంత వరకు మహాకూటమిలో ఎవరికి ఎన్ని సీట్లు దక్కనున్నాయి అనే విషయం కాంగ్రెస్ పార్టీ వెల్లడించకుండా నాన్చుడు ధోరణిలో ముందుకు పోతుంది. ఈ పరిణామాలతో మహాకూటమిలోని టీజెఎస్, సిపిఐ ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ మొదటగా 25 స్థానాలలో పోటీ చేయాలని గట్టిగా పట్టుబట్టినా కాంగ్రెస్ పార్టీ మాత్రం 14 సీట్లను మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు రావడంతో టిడిపి నాయకులు కూడా ఇచ్చినన్ని సీట్లు తీసుకొని గుమ్మనంగా కూర్చున్నారు. కానీ టీజెఎస్, సిపిఐ ఈ రెండు పార్టీలకు కలపి 10 సీట్లకు అటు ఇటుగా ఇవ్వనున్నారని కాంగ్రెస్ పార్టీ నుంచి లీకులు వదులుతున్నారు.

దీనిపై టిజెఎస్ అధ్యక్షుడు కోదండరాం చాల ఆగ్రహంతో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పట్టుమని 10 స్థానాలలో కూడా పోటీ చేయకుండా ఇంకా పార్టీ పెట్టడం ఎందుకని అంటున్నారట. సిపిఐ పార్టీ కూడా తాము తొమ్మిది స్థానాలు కోరుతున్నామని, ఆ తొమ్మిది స్థానాలు కూడా ఇప్పటికే బయటకు అనౌన్స్ చేసి, కాంగ్రెస్ పార్టీ కూటమిలో భాగంగా ఆ స్థానాలు కేటాయించాలని, లేకపోతే 25 స్థానాలలో పోటీ చేసి తమ సత్తా ఏమిటో చూపిస్తామని బెదిరింపులకు దిగుతుంది.

కానీ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ చివరకు వీరిద్దరకు కలపి కొన్ని సీట్లు ఇచ్చి వాటిలో మాత్రమే పోటీ చేయించేలా చూస్తుంది. దీనిపై ఇప్పటికే టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం సిపిఐ నేతలతో భేటీ అయినట్లు తెలుస్తుంది. మన ఇద్దరం కూటమి నుంచి బయటకు వచ్చి మన కలయికలో మరో కూటమి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట.

ఒకవేళ ఈరెండు పార్టీలు కూటమి నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే అసలు వీరికి గెలిచే అంత సత్తా ఉందా అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వీరి బలం అంతంత మాత్రమే అని, ఓట్లు చీలి టిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ మేలు జరుగుతుందో అనే నెపంతోనే వీరిద్దరని కూటమిలో ఉంచుకొని కొన్ని సీట్లు ఇస్తున్నారట. ఎన్ని బెదిరింపులు చేసినా చివరకు వారిద్దరూ ఇచ్చిన సీట్లు తీసుకొని మహాకూటమి నుంచి పోటీ చేయడం తప్ప గత్యంతరం లేదని చెప్పుకోవచ్చు. కనీసం చివరి వరకు గొడవ చేసినా… ఒకటి, రెండు సీట్లు పెంచినా పెంచ వచ్చని ఆశ రెండు పార్టీలలో ఉండటంతో ఈ లొల్లి బయటకు కనపడుతుందని, లోపల మాత్రం అనుకున్నంత సీన్ లేదని అంటున్నారు. చూద్దాం ఈరోజు, రేపటిలోపు మహాకూటమిలో స్పష్టత రానుండటంతో ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలుస్తుంది.