రెండు తెలుగు రాష్ట్రాలలో చివరి స్పీకర్ గా సేవలందించిన నాదెండ్ల మనోహర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. రాజీనామా అనంతరం నాదెండ్ల తిరుపతి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు సాయంత్రం తిరుపతి చేరుకొని రేపు ఉదయం తిరుమలలో స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది. అనంతరం నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరవచ్చని తెలుస్తుంది.

నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ కు ఇది వరకే వారిద్దరి మధ్య హైదరాబాద్ లో చర్చలు జరిగాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ తన పార్టీలో చేరికలు కూడా ముమ్మరం చేసారు. దీనిలో భాగంగానే నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరి తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సమాయత్తమవుతున్నారు. తెనాలి నియోజకవర్గంలో 30 వేల పైచిలుకు కాపు కులానికి చెందిన ఓట్లు ఉండటంతో నాదెండ్ల జనసేన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెనాలి నియోజకవర్గంలో పోటీ చేసి 20 వేల ఓట్లు తెచ్చుకున్న నాదెండ్ల మనోహర్ వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ తరుపున పోటీ చేసి ఏమాత్రం రాణిస్తారో చూడాలి.