పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రను తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఇక ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇక అపుడప్పుడు ప్రతిపక్ష నేత జగన్ పై కూడా విమర్శల దాడి చేస్తూ ఉంటారు. ఈసారి కొంత వింతగా ఆశ్చర్యం కలిగించే రీతిలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, తిరిగి పవన్ కళ్యాణ్ వైపు వేలు చూపించేలా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి గాని, వైఎస్ జగన్ కు గాని తెలంగాణాలో పర్యటించే దైర్యం లేదని అన్నారు. జనసైనికుల బలం కలిగిన తనకు మాత్రమే తెలంగాణాలో పర్యటించే సత్తా ఉందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ కు అంత సత్తా ఉన్నప్పుడు తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయవచ్చు కదా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ జగన్ తన ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఈసారి ఎట్టి పరిస్థితులలో గెలుపే లక్ష్యంగా ప్రస్తుతానికి తెలంగాణపై దృష్టిపెట్టే అంత సమయం లేక తెలంగాణ ఎన్నికలను పక్కన పెట్టారు.

చంద్రబాబు నాయుడు మాత్రం మహాకూటమితో బాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్నట్లు నిజంగా తెలుగుదేశం ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడుకి తెలంగాణాలో తిరిగే సత్తా లేకపోతే ఎన్నికలలో పోటీ చేయరు కదా అనే విమర్శలు పవన్ పై వస్తున్నాయి.

ఎన్నికలలో పోటీ చేయకుండా తెలంగాణాలో తిరిగే సత్తా తనకే ఉందని మాట్లాడుతూ వాపుని చూసి బలుపనుకుంటున్నాడని అందుకు తగట్లు పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పోటీ చేయకపోవడానికి మరొక కారణం కూడా ఉంది. జనసేన పార్టీ పేరుతో మొదటి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసి ఒక్క సీటు కూడా సాధించలేకపోతే, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని, అందుకే ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ తెలంగాణాలో తానొక్కడినే పర్యటించగలను అంటూ పవన్ చేసే ఆరోపణలు ఆశ్చర్యంతో పాటు అవగాహనారాహిత్యం కూడా కనపడుతుంది.