పవన్ కళ్యాణ్ మరోసారి తెలుగుదేశం పార్టీతో పాటు, ఆ పార్టీ నాయకులపై విమర్శలు సంధించారు. గత ఎన్నికలలో తాను సపోర్ట్ ఇవ్వడం వలనే తెలుగుదేశం పార్టీకి అన్ని సీట్లు వచ్చాయని, లేకపోతే 37 సీట్లకే పరిమితమయ్యేదని అన్నారు. పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశం పార్టీ లబ్ది పొందిన మాట వాస్తమే, కానీ ఎంత వరకు అనేది చెప్పడం కష్టమే.

పవన్ కళ్యాణ్ చెబుతూ టిడిపి గత ఎన్నికలలో 37 సీట్లకు పరిమితమవ్వాలి కానీ నావల్ల దాదాపుగా 100 సీట్ల వరకు గెలుచుకోగలిగింది అని అంటున్నారా? అలా అయితే గత 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నేరుగా పోటీ చేస్తే, పవన్ మాటల ప్రకారం ఏపీలో హాంగ్ ఏర్పడి సీఎం అయ్యేవాడు కదా అని అంటే దానిపై జనసేన నేతల దగ్గర సమాధానం ఉండదు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ తన వల్లే అధికారాన్ని కైవసం చేసుకుంది అనుకుంటే, ఇలాంటి డప్పు కొట్టుకోకుండా నేరుగా ఎన్నికలలో గెలిచి, ఇది నా సత్తా అని చూపించాలి గాని ఇలా పదే పదే తన వల్లే అని చెప్పుకుంటూ విమర్శల పాలవ్వడం తప్ప మరొకటి లేదు.

పవన్ కళ్యాణ్ లెక్కల ప్రకారం వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 37 స్థానాలకే పరిమితమవ్వబోతుందా? లేక ప్రభుత్వ వ్యతిరేకతతో అంత కన్నా తక్కువ స్థానాలనే దక్కించుకుంటుందా అనేది పవన్ దగ్గర ఎలాంటి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయో బయటకు చెప్పలేదు. మరోవైపు వైసిపి పార్టీతో పొత్తు బేరసారాలు వర్క్ అవుట్ అవ్వలేదని, మరోసారి తన వల్లే ప్రభుత్వం ఏర్పాటు జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వారి చెంతకు చేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడా అనేది తెలంగాణ ఎన్నికల హడావిడి పూర్తయితే గాని చెప్పలేము.