కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి “కొలన్ హనుమంత్ రెడ్డి” గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అతని ఓటమి గురించి చెప్పు కోవాలంటే కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలనట్లు కొలన్ పరిస్థితి కూడా అలానే తయారయింది 2014 ఎన్నికల సమయంలో. అప్పట్లో కొలన్ కుటుంబానికి చెందిన హనుమంత్ రెడ్ట్ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయగా, అతని దగ్గర బంధువైన కొలన్ శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసారు. ఈ ఎన్నికలలో తమ కుటుంబ ఓట్లతో పాటు మొదటి నుంచి కొలన్ కుటుంబాన్ని నమ్ముకున్న అభిమానులు రెండుగా చీలడంతో అప్పటి తెలుగుదేశం అభ్యర్థి వివేకానంద గౌడ్ అవకాశం అంది పుచ్చుకొని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇక ఓటమి తరువాత కొలన్ హనుమంత్ రెడ్డి ఎటువంటి నిరుత్సాహానికి లోనవ్వకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ తన వంతుగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కొలన్ హనుమంత్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి కేసీఆర్ మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పలు ప్రాంతాలలో పాదయాత్రలతో పాటు, అన్నా అంటు ఎవరైనా తలుపు తడితే వారిని ఆర్ధికంగా ఆదుకోవడంలో తన వంతు కృషి చేస్తాడనే మంచి పేరు ఉంది.

గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి జంప్ అయిన వివేకానంద్ గౌడ్ వచ్చే ఎన్నికలలో తనకే టికెట్ లభిస్తుందని ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న ఎమ్మెల్యేల జాబితాలో కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు గుస గుసలు వినపడుతున్నాయి.

ఈ క్రమంలోనే అధికార పక్షానికి చెందిన కొంత మంది నాయకులు పనిగట్టుకొని వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కొలన్ హనుమంత్ రెడ్డిని పోటీ నుంచి తప్పించే క్రమంలో కుట్రలకు తెర తీశారు. 2014 ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత పార్టీపై తన పట్టు పెంచుకునేందుకు మరింత కృషి చేస్తున్న కొలన్ లాంటి వారిని తప్పించి తాము రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తరువాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజలకు అండదండలు అందిస్తూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు తమ వంతు కృషి చేసిన వారిలో కొలన్ ముందు వరుసలో ఉన్నారు. కొలన్ హనుమంత్ రెడ్డి మాత్రం తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా జరుగుతున్న కుట్రకు ఏమాత్రం నిరుత్సాహ చెందకుండా తాను చేసే మంచి పనులే తనకు వచ్చే ఎన్నికలలో కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ టికెట్ వచ్చేందుకు దోహదం చేస్తుందని భావిస్తూ కార్యకర్తలతో మమేకమవుతున్నారు.

ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ నుంచి పిరాయించిన వ్యక్తికి కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడా? మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పాదయాత్రల పేరుతో ప్రజల మధ్యలో మమేకమైన కొలన్ హనుమంత్ రెడ్డికి టికెట్ దక్కుతుందో త్వరలో ఒక స్పష్టమైన క్లారిటీ రానుంది.