ముందుస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార తెరాస పార్టీ జనాలపై వరాల జల్లు కురిపించింది. సీఎం కెసిఆర్ కొత్తగా నిరుద్యోగ భృతి, రైతులకు లక్ష లోపు రూణాలు మాఫీ వంటి కీలకమైన హామీలను ప్రకటించారు. రైతు బంధు పధకం కింద ఇచ్చే సాయాన్ని ఎకరానికి రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామన్న కెసిఆర్.. అలాగే ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నామని, వాటిని పొందేందుకు వయో పరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని తెలిపారు. అలాగే రెడ్డిలకు, ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కీలక ప్రకటన చేసారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్‌ నుంచి వీటిని అమలు చేస్తామన్నారు.

రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని కొనసాగిస్తూనే ఎవరికైనా సొంత స్థలంలో ఇల్లు కావాలంటే కట్టిస్తామన్న కెసిఆర్.. లేకపోతే వారే కట్టుకుంటానంటే సాయం అందిస్తామని తెలిపారు. రూ. 2,000 కోట్లతో పంటల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో మధ్యంతర భృతి, చిరుద్యోగులకు వేతనాల పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 25,000 కోట్లతో ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతామని తెలియచేసారు. ఇవి కొన్ని కీలక నిర్ణయాలు మాత్రమేనన్న ఆయన.. తుది ప్రణాళికలో మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలుంటాయని చెప్పారు.