కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈసీ ఆదేశాలతో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నేడు కోస్గిలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బహిరంగ సభ దృష్య్టా రేవంత్‌ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు రేవంత్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీ పోలీసులను ఆదేశించింది.

రేవంత్‌ రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిగి వద్ద వాచ్‌మెన్‌ను వదిలివెళ్లారు. రేవంత్‌ అరెస్ట్‌తో కొడంగల్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అన్యాయానికి పరాకాష్ట అని, పోలీసులు తలుపు విరగగొట్టి ఇంటి లోపలకి వచ్చినట్టు తెలిపారు. ఇంట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకోమని ఆమె పేర్కొన్నారు. కాగా రేవంత్‌రెడ్డిని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.