సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తనకు చిన్నప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అంటే ఇష్టమని… అందుకే ఆ పార్టీలో చేరానని బండ్ల గణేష్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ త్యాగాలకు ప్రతిరూపమన్న బండ్ల గణేష్‌.. పార్టీ కోసం పదవులను సైతం వదులుకున్న రాహుల్‌గాంధీ నేతృత్వంతో ఆ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. కాగా గణేష్‌.. షాద్ నగర్ నుండి పోటీ చేస్తారని సమాచారం. షాద్ నగర్ నియోజకవర్గంలో గణేశ్ కు రాజకీయంగా ఏమీ పట్టులేనప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆయనకు పలువురితో పరిచయాలున్నాయి. గణేశ్ చేరికతో షాద్ నగర్ లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.