తెలుగుదేశం పార్టీ సంబరాలు ఎందుకు చేసుకుంటుందా అని అనుమానం రావచ్చు. కానీ వారు చేసుకుంటున్న సంబరాలకు కారణం కర్ణాటక ఎన్నికలలో బిజెపి పార్టీ ఓడిపోవడమే. భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో అంటకాగిన తరువాత బిజెపిని టిడిపి ప్రధాన ప్రత్యర్థిగా చూస్తుంది. ఇక దేశ వ్యాప్తంగా మోదీ సీన్ అయిపోయిందని, వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కూడా బిజెపి ప్రభుత్వం చతికలపడటం ఖాయమని తెలుగుదేశం నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇందులో కొస మెరుపేమిటంటే ఇంకా ఎన్నికల రిజల్ట్స్ పూర్తి స్థాయిలో బయటకు రానప్పటికీ, తెలుగుదేశం నాయకులు మీడియా ముందుకు వచ్చి ఇది తాము సాధించిన ఘన విజయంలాగా హడావిడి చేసారు. మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో పాటు ఒకొక్కరు మీడియా ముందుకు వచ్చి బిజెపి పైన వారికున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2004 నుంచి బళ్లారి పార్లమెంట్ లో తమ హావ చూపిస్తున్న గాలి సోదరులకు ఈ ఉపఎన్నికలు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. గాలి జనార్దన్ రెడ్డి అనుంగ అనుచరుడు శ్రీరాములు సోదరి వి.శాంతపై కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప బారి మెజారిటీతో విజయం సాధించాడు. తెలంగాణాలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇదే విధంగా టిఆర్ఎస్ చతికిల పడుతుందని, మహాకూటమి విజయదుందుబి మోగించి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అంటున్నారు. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంత వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. సాయంత్రం ఏమైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారేమో చూడాలి.