ఏపీలో ఎన్నికల హడావిడి మొదలవుతుంది. తెలుగుదేశం పార్టీలో చేరడానికి వివిధ పార్టీల నాయకులూ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్న నేతలలో ముఖ్యంగా సబ్బం హరి ముందు వరసలో ఉన్నారు. అలాగే కొణతాల రామకృష్ణ, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మరి కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కప్పుడు మాజీ ఎంపీ సబ్బం హరి మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డికి ఆ తర్వాత వైఎస్ జగన్ కి సన్నిహితంగా ఉన్నారు. తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆయన జగన్ కి దూరం అయ్యారు. ఆయన ఈ మధ్యకాలంలో చంద్రబాబుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబు కూడా సబ్బం హరిని పార్టీలో చేర్చుకోవడానికి సిగ్నల్ ఇచ్చారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడైన ఆదిశేషగిరిరావు.. ఈయనకు జగన్ తో పాటు వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ఆదిశేషగిరిరావు. కాగా ఆయనకు వైసీపీలో టికెట్ విషయంలో విభేదాలు రావడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసారు. రాజీనామా లేఖను జగన్ కి పంపించారు. కాగా కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపీ గా ఉన్నారు. కావున ఆదిశేషగిరిరావు చేరిక కూడా చంద్రబాబు నుండి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆదిశేషగిరిరావు వైసీపీని వీడటం ఆ పార్టీకి కొంత దెబ్బని చెప్పవచ్చు.

konathala babu

అయితే కొణతాల రామకృష్ణ చేరికకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనపడుతుంది. చంద్రబాబు సైడ్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తున్న ఈయన కొంత ఆలోచిస్తున్నారు. కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసి వారి అభిప్రాయం ప్రకారం ఆయన నడుచుకోవాలని చూస్తున్నారు. ఈయన కూడా మొదట జగన్ కు బాగా సన్నిహితంగా ఉండేవారు. ఈ మధ్యకాలంలో కొణతాల టీడీపీపై కొంత సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈయన జగన్ నుండి విడిపోయాక ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడారు. కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరితే ఆ పార్టీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంది.

ఈ ముగ్గురు సీనియర్ నాయకులూ టీడీపీలో చేరడం ద్వారా ఉత్తరాంధ్రలో ఆ పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేతలతో పాటు మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పచ్చకండవా కప్పుకోబోతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కొంత మంది సీనియర్ నాయకులూ కాంగ్రెస్-టీడీపీ పొత్తుపైనా తమ ఆశలు పెట్టుకున్నారు. మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అయితే పొత్తు ఖరారైందని, పొత్తులో భాగంగా కర్నూల్ ఎంపీ సీటు తనకే కన్ఫర్మ్ అని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అలాగే రఘువీరా రెడ్డి ఇంకా కొంత మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న అంశాన్ని పరిశీలిస్తూ దానిని బట్టి నిర్ణయం తీసుకుందామనే ఆలోచనలో పడ్డారు.