నాలుగున్నరేళ్ల పాటు టీడీపీలో నరకయాతన అనుభవించానని చెప్పారు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జున రెడ్డి. విలువలు లేని చంద్రబాబు దగ్గర ఉండలేకపోయానని.. అందుకే ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. హైదరాబాద్ లో ఆయన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని, కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి గెలిచిన చంద్రబాబును ప్రజలు ఇప్పుడు నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. బాబును ఇంకా నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని అన్నారు.

మంత్రి ఆదినారాయణ రెడ్డి వైసీపీ భిక్ష పెడితే గెలిచారని, తర్వాత వంచన చేసి, టీడీపీలో చేరి.. మంత్రి అయ్యారని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి తనను విమర్శించే అర్హత లేదన్నారు. తనను గెలిపించిన ప్రజల కోసం రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డానని మేడా వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌, షర్మిల చేపట్టిన పాదయాత్రలు చరిత్ర సృష్టించాయని.. ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు.ఈ నెల 31 వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు మేడా.