చిన్నబాబు దెబ్బతో కర్నూల్ రాజకీయాలు వేడెక్కాయి. లోకేష్ పార్టీలో తన విలువ ఏమిటో అందరికి తెలియచెప్పాలని ఆశించాడో లేక, తానే 2019 ఎన్నికలకు సుప్రీమ్ అని చాటుకోవాలని ప్రయత్నించారో తెలియదు గాని కర్నూల్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించి తెలుగుదేశంలో ఉన్న కొంత మంది నాయకులకు కోపాన్ని తెప్పించారు. కర్నూల్ ఎమ్మెల్యే, కర్నూల్ ఎంపీగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి, బుట్ట రేణుక వైసిపి నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి పిరాయించారు. వీరిద్దరి పిరాయింపుల నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే టికెట్ తన కొడుకు చేత పోటీ చేయించాలని ఆస పడిన టిజి వెంకటేష్ నోట్లో వెలక్కాయ పడినట్లయింది. ఈ గొడవ రెండు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. టిజి వెంకటేష్ ఎప్పటికప్పుడు వైసిపి నుంచి పిరాయించిన ఎస్వీ మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ రాదని, తన కొడుకుకే ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశం నుంచి వస్తుందని చెబుతూ వచ్చారు.

ఈ రచ్చ జరుగుతున్న నేపథ్యంలో లోకేష్ అర్ధాంతరంగా కర్నూల్ అసెంబ్లీ నుంచి ఎస్వీ మోహన్ రెడ్డి 2019 తెలుగుదేశం తరుపున అభ్యర్థిగా నిలబెడతాడని ప్రకటించి టిజి వెంకటేష్ వర్గాన్ని కంగుతినిపించాడు. దీనితో టిజి వెంకటేష్ అసహనం వ్యక్తం చేసి ఇంత ముందుగా తెలుగుదేశం పార్టీలో టికెట్స్ ప్రకటించే సంస్కృతి లేదని, లోకేష్ ప్రకటనతో వచ్చే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది.

ఇంత అసమ్మతి నెలకొని ఉన్న, వైసిపి పార్టీ టిజి వెంకటేష్ తో చర్చలు చేసేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయలేకపోయింది. దీనితో టిజి వెంకటేష్ వర్గీయులు వైసిపి నాయకులకు టిజి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని చెబుతూ కర్నూల్ రాజకీయాలలో కాక రేపుతున్నారు. ఇలాంటి పీలర్లు వదలడంతో టిజి వెంకటేష్ వైసిపిలోకి రావడానికి ఆసక్తి కనపరుస్తున్నాడని తన వర్గీయులతో చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం వైఎస్ జగన్ కర్నూల్ లో నెలకొన్న రాజకీయాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తిగా ఉంది.

టిజి వెంకటేష్ వైసిపి నేతలతో టచ్ లోకి వెళ్లాడని సమాచారంతో తెలుగుదేశం నాయకులు అలర్ట్ అయ్యారు. టిజిని బుజ్జగించే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తుంది. కానీ టిజి వెంకటేష్ మాత్రం తన కొడుకుని వచ్చే ఎన్నికలలో కర్నూల్ అసెంబ్లీ బరిలో నిలిపి ఎమ్మెల్యేగా చూడాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పరిణామాలపై ఎస్వీ మోహన్ రెడ్డి స్పందిస్తూ, టిజి వెంకటేష్ ను తెలుగుదేశం రాజ్యసభకు పంపించేటప్పుడే తనకు కర్నూల్ అసెంబ్లీ సీటు కేటాయిస్తానని చెప్పారని, నాకు ఎవరితో శత్రుత్వం లేదని వచ్చే ఎన్నికలలో కర్నూల్ అసెంబ్లీ నుంచి తెలుగుదేశం తరుపున నేనే పోటీ చేస్తానని తెలియచేసారు.

టిజి వెంకటేష్ వర్గం చివరకు చంద్రబాబు నాయుడు కర్నూల్ అసెంబ్లీ టికెట్ టిజి కుమారుడికి కేటాయించినా కేటాయించవచ్చని, లోకేష్ కు రాజకీయ అవగాహన లేక సీట్లు ప్రకటిస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సీటు పొందగలిగిన టిజి వెంకటేష్ కు తన కొడుకుకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవడం పెద్ద విషయమా అని వ్యాఖ్యలు కనపడుతున్నాయి. ఎన్నికలు దగ్గరకు వచ్చిన తరువాత ఇక్వేషన్స్ అన్ని మారిపోతాయని, ఒకవేళ టిజి వెంకటేష్ కొడుకుకి తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ కేటాయించని పక్షంలో వైసిపి నుంచి పోటీ చేయడానికి ఇప్పటి నుంచే మంతనాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు అనడానికి ఇదే నిదర్శనం. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీటుకి ఎంపికైన టిజి వెంకటేష్ కొడుకు అసెంబ్లీ టికెట్ కోసం పక్క పార్టీతో సంప్రదింపులు జరపడం చూస్తుంటే, రేపు వైసిపి నుంచి తన కొడుకుకి టికెట్ ఇప్పించుకొని ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఒక వేళ వైసిపి అధికారంలోకి రాకపోతే మరలా తెలుగుదేశంలోకి జంప్ చేసినా చేస్తాడు. ఇలాంటి వారితో రాజకీయాలలో జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే అవసరాల కోసం పార్టీలు మారుతూ రాజకీయ విలువలను మంటలోకి కలపడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు.

Tags : TG Venkatesh, Telugudesam, Kurnool, Ys Jagan, Ysrcp