టీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించి మరోసారి ముఖ్యమంత్రిగా గెలవాలని వేసిన ఎత్తులను చిత్తు చేస్తూ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకంగా గళం విప్పడంతో ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని అన్ని వర్గాల ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ విషయం కేసీఆర్ కు తాను చేసిన తప్పు త్వరగానే తెలుసుకోవడంతో దిద్దుబాటు చర్యలకు దిగి తాను తొమ్మిది నెలలు ముందుగా ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో చెప్పి ప్రజల మన్ననలు పొందేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ అధినేత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వరంలా మారింది.

బిజెపి పార్టీని వీడి కాంగ్రెస్ పంచన చేరాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడుకి తెలంగాణ ఎన్నికలు బాగా కలసి వచ్చాయి. ఆర్ధికంగా లోటులో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు లాంటి ఆర్ధిక వనరులు గట్టిగా ఉన్న నేత అండ కావాలన్న కోరికతో చంద్రబాబు నాయుడుని దగ్గరకు తీసుకొని, మహాకూటమి పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసి అందులో చంద్రబాబు నాయుడుని భాగస్వామిగా చేసుకొని, చివరకు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాంగ్రెస్ అధిష్టానం దేహి అనే స్థాయికి చేరింది. కారణం ఆర్ధికపరమైన కారణాలు కావచ్చు, ఇంకా లోపాయికారి ఒప్పందాలు కావచ్చు… కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దగ్గరకు చేరతీసిందో, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గానికి నచ్చకపోగా.. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తలచిన వారు కూడా ఇప్పుడు తిరిగి టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి మరోసారి తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టడానికి ఇష్టపడటం లేదు.  

ఈ పరిణామాలతో హైదరాబాద్ లో ఉండే సెటిలర్స్ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతూ, మహాకూటమి అభ్యర్థులను ఓడించే దిశగా పావులు కదుపుతున్నారు. కేటీఆర్ కూడా సెటిలర్స్ తో మీటింగ్ పెట్టి వారిని ఆకట్టుకొనే పని చేస్తూ, చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహాన్ని సెటిలర్స్ కు వివరిస్తూ మరోసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సెటిలర్స్ ను వేడుకోవడం కూడా సెటిలర్స్ చాల మందిలో మార్పు వచ్చి తమ ఓటు టీఆర్ఎస్ పార్టీకి వేసేందుకు సిద్ధమవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ మాత్రం తనకు అందివచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకొని ఆర్ధిక వనరుల కోసం చంద్రబాబు నాయుడుతో చేతులు కలపడంతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభినులుగా కొనసాగుతున్న చాల మందిని బాధపెట్టడంతో పాటు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మింగుడు పడకపోవడంతో, మహాకూటమి ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా ప్రచారానికి రెండు రోజులే ఉండటంతో కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని వివరిస్తూ తన ప్రసంగాలలో పదును పెంచి ముందుకు సాగుతున్నారు.