రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నిశ్శబ్ద విప్లవం కనపడుతుందని, ప్రజలు బిజెపిని శనిగ్రహంలా, టిడిపి, వైసీపీలను రాహు, కేతువులుగా చూస్తున్నారని, జనసేన ధనసేనగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ గురించి బయటకు వచ్చి మాట్లాడేవారు ఇంకా ఉన్నారా అంటే ఆశ్చర్యం కలగక మారదు. కాంగ్రెస్ పార్టీకి నిశ్శబ్ద విప్లవం కాదు, నిశ్శబ్దంగా గత ఎన్నికలలో పడిన అరకొర ఓట్లు కూడా అడుగంటిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇక రాష్ట్రంలో తిరిగి కోలుకునే పరిస్థితి లేదని, ఆ పార్టీలో కాస్తో కూస్తో ఫేమ్ ఉన్న నాయకులు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కోస్తాలో కొంచెం పట్టున్న నేతగా గుర్తింపు పొందిన నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, జనసేన పార్టీలో చేరారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అన్ని జిల్లాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు… టిడిపి, వైసిపి పార్టీలలో ఉన్న తెలిసిన మిత్రులతో మాట్లాడి తమను పార్టీలో చేర్చుకోవలసిందిగా వేడుకుంటున్నట్లు తెలుస్తుంది. వారంతా ఆ రెండు పార్టీల అధ్యక్షుల నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరొక 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో కోలుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు. అసలు ముందు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో కనీసం 10 నియోజకవర్గాలలో అయినా డిఫాజిట్స్ తెచ్చుకోగలిగితే అదే గొప్పగా చెప్పుకోవచ్చు.