ఒకవైపు తెలుగుదేశం పార్టీలో వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు స్థానం తనదంటే, తనది అని చంద్రబాబు నాయుడు దగ్గర ఎడతెగని పంచాయితీలు నడుపుతున్న ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డిలకు షాక్ ఇస్తూ వైఎస్ జగన్ జమ్మలమడుగు వైసీపీ టికెట్ ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర ముగించుకొని కడప వచ్చిన సందర్భంలో జమ్మలమడుగు వెళ్లిన వైఎస్ జగన్ ప్రజల సమక్షంలో యువకుడైన సుధీర్ రెడ్డి వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు నుంచి వైసిపి పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని తెలియచేసారు.

గత మూడు సంవత్సరాలుగా జమ్మలమడుగులో ఇద్దరు కరుడుకట్టిన ఫ్యాక్షన్ నాయకులను తట్టుకుంటూ రాజకీయం చేస్తున్న సుధీర్ రెడ్డికి వైఎస్ జగన్ టికెట్ కేటాయించడంతో వచ్చే ఎన్నికలలో ఫ్యాక్షనిస్టులు దూరం పెట్టి యువకుడు డాక్టర్ అయిన సుధీర్ రెడ్డికి పట్టం కట్టడాన్ని ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు తెలియచేస్తున్నాయి. సుధీర్ రెడ్డి వృత్తి రీత్యా వైద్యుడిగా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసారు. సుధీర్ రెడ్డి స్వయానా సీనియర్ రాజకీయ నాయకుడు ఎంవీ మైసూరా రెడ్డి తమ్ముడు కొడుకు కావడం గమనార్హం. అదే విధంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి స్వయానా బావమరిది కావడం మరో విశేషం. సుధీర్ రెడ్డి చెల్లెలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసుకున్నాడు.

ఒకవైపున చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు నుంచి తెలుగుదేశం తరుపున రామ సుబ్బారెడ్డిని పోటీకి నిలిపి, ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ స్థానానికి పంపించాలని ఆలోచన చేస్తున్నాడు. ఆదినారాయణ రెడ్డి మాత్రం ఓడిపోయే కడప ఎంపీ స్థానం తనకు వద్దని తనకు జమ్మలమడుగే కావాలని పట్టుబడుతున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తున్న రామ సుబ్బారెడ్డికి టికెట్ కేటాయించాలని నిర్ణయానికి రాగా, ఆది నారాయణ రెడ్డి మాత్రం తన ప్రయత్నాలలో తాను ఉన్నాడు.