వైఎస్ జగన్ తాను నమ్మిన సిద్దాంతం వైపు పయనిస్తాడని గత తొమ్మిది సంవత్సరాలుగా తెలిసిన విషయమే. గత తొమ్మిదేళ్లలో వైఎస్ జగన్ కుటుంబం పడినన్ని బాధలు దేశంలో ఏ రాజకీయ కుటుంబం అనుభవించి ఉండదు. కోతగా వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై కూడా భారతి సిమెంట్ విషయంలో ఏడు సంవత్సరాల తరువాత చార్జిషీట్ పెట్టి మరో కుట్రకు తెర తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలో భాగంగా వైఎస్ కుటుంబాన్ని 2019 ఎన్నికల ముందు వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైందని అర్ధమవుతుంది.

కానీ వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా తాను అనుకున్నది సాధించే వరకు వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నాడు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు డొంక తిరుగుడులా వ్యవహరిస్తుంటే వైఎస్ జగన్ మాత్రం 2014 ఎన్నికల ముందు ఎలాంటి వైఖరి అనుసరించాడో ఇప్పటి వరకు అదే వైఖరి అనుసరిస్తూ ప్రత్యేక హోదా కోసం నిరంతరాయంగా పోరాడుతూనే ఉన్నాడు. తాను నమ్మిన సిద్ధాంతం వైపు వెళితే కష్ట నష్టాలు ఉంటాయని తెలిసినా, కేసులు పెట్టి వేదిస్తారని తెలిసినా మొండి వైఖరితో పోరాట కొనసాగిస్తున్నాడు.

వైఎస్ జగన్ మరోసారి ప్రత్యేక హోదా గురించి తన మనసులో మాట బయట పెట్టాడు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైతే తీసుకువస్తారో వారికే మా మద్దతు ఉంటుందని, అది కాంగ్రెస్, బిజెపిలలో ఎవరైనా పర్లేదని మాకు ప్రత్యేక హోదా సాధించడమే ముఖ్యమని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుందని, కానీ మాకు గతంలో బిన్నమైన అనుభవం ఉందని అందువల్ల ఎవరని నమ్మబోమని, ముందుగా ప్రత్యేక హోదా కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఇవ్వజూపితే వారికే మా మద్దతు ఉంటుందని మరో సారి కుండబద్ధలు కొట్టారు.

ఇప్పటికే ప్రత్యేక హోదా సాధన విషయమై వైసిపి ఎంపీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా తాము తెస్తామంటే తాము తెస్తామని కబుర్లు చెబుతూ ప్రజల ఓట్ల కోసం అర్రులు చాస్తున్నాయి. కానీ కొన్ని మీడియా చానెల్స్ ఈ మధ్య ప్రజల వద్దకు వెళ్లి ప్రత్యేక హోదా గురించి అడుగగా అందరూ నిస్సంకోచంగా వైఎస్ జగన్ ఒక్కడే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడని తెలియచేసి వైఎస్ జగన్ కు వచ్చే ఎన్నికలలో మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియచేసారు.

వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కావాలని అన్ని జిల్లాలో సభలు, సమావేశాలు పెట్టి విద్యార్థులకు ప్రత్యేక హోదాపై అవగాహన కల్పిస్తుంటే, అప్పట్లో చంద్రబాబు మీడియా సాక్షిగా విద్యార్థులను వారి తల్లితండ్రులు జగన్ సభలకు పంపితే విద్యార్థులను అరెస్ట్ చేసి జైలుకు పంపుతామన్న మాటలు వైఎస్ జగన్ పెట్టిన సభలకు వెళ్లిన వేల మంది విద్యార్థులు మర్చిపోయి ఉండరు. చంద్రబాబు ఆ విషయాలన్నీ మర్చిపోయినా కుర్రోళ్ళు కదా ఉడుకు రక్తం వారు మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈరోజు మాత్రం చంద్రబాబు మాట్లాడుతూ అసలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది నేనే అంటూ మాట్లాడుతుంటే సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలతో చంద్రబాబు ప్రభుత్వంపై దాడులు చేస్తున్నారు. చంద్రబాబుకి మతిమరుపు ఉండవచ్చు లేకపోతే, తన పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని ఒక విషయాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారని 1995 కాలం నాటి రోజులులా ఆలోచిస్తే కుదరదని, టెక్నాలజీతో అందరూ అప్ డేట్ ఐ చంద్రబాబు నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా వస్తే ఏమి ఉపయోగమని మీడియా వేదికగా మాట్లాడిన మాటలు పదే పదే గుర్తు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.