సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వెలువడిన ఒకటి రెండు రోజుల్లోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తానని పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. హైద్రాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జిల సమావేశంలో పాల్గొన్నారు. సామర్థ్యం ఉన్నవారికే ఎన్నికల ఇంచార్జి లాగా భాద్యతలు అప్పగిస్తున్నామన్న జగన్.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు చేదోడు వాడోడుగా ఉండాలని కూడా ఆయన వారిని కోరారు. బస్సు యాత్ర కూడా షెడ్యూల్ విడుదలైన వెంటనే మొదలు పెడతామని అన్నారు జగన్.

రానున్న 45 రోజులు పార్టీకి చాలా కీలకం అన్నారు జగన్. తొమ్మిదేళ్లపాటు ఎన్నో పోరాటాలు చేశామని.. ఈ 45 రోజులు కూడా అదే స్పూర్తితో పోరాట పటిమ ప్రదర్శించాలన్నారు. ఈ 45 రోజులు త్యాగాలు చేయాలని కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవడం మనందరి ముందున్న కర్తవ్యం అని ఉద్బోధించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలూ బతికి బట్టకట్టాలంటే వైసీపీ గెలుపు ఒక్కటే మార్గమని వైఎస్ జగన్ స్వష్టం చేశారు.