ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వర రావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ రావులను వెంటనే బదిలీ చేయాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. సోమవారం జగన్ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్‌ అరోరాను కలిసి అధికార టీడీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.

ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారికే డిఎస్పి ప్రమోషన్లు ఇస్తున్నారని అన్న జగన్.. 37 మందిలో 35 మంది ఒకే సామాజికవర్గం వారని జగన్ అన్నారు. ఇప్పటికే ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని, నాలుగు వేల కోట్ల రూపాయలు ఇందుకు వాడుతున్నారని అన్నారు. ఈ రకంగా డబ్బు పంపిణీలో పొలిసు అధికారుల పాత్ర కూడా ఉందన్న జగన్.. ఈ విషయాలపై గవర్నర్ తదితరులకు కూడా పిర్యాదు చేశామని ఆయన అన్నారు.

అలాగే సెప్టెంబర్‌ 2018 నాటికి 52 లక్షల 67వేల నకిలీ ఓట్లు చేర్చారన్న ఆయన.. ప్రస్తుతం నకిలీ ఓట్ల సంఖ్య 59.18 లక్షలకు చేరిందన్నారు. మొత్తం 3 కోట్ల 69 లక్షల ఓట్లలో 59 లక్షల మంది నకిలీ ఓటర్లున్నారు. దాదాపు 60 లక్షల ఓట్లలో 20 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డబుల్‌గా నమోదయ్యాయి. ప్రజాధికార సర్వే, రియల్‌టైమ్‌ గవర్నమెంట్‌ పిరియాడిక్‌ సర్వేల పేరుతో వివరాలు తెలుసుకుని ఓట్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే 4 లక్షల వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఈ తొలిగింపు ప్రక్రియకు ఒక యాప్‌ను కూడా క్రియేట్‌ చేశారని.. ఈ విషయాలన్నింటిని ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు జగన్.