వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన లుకలుకలతో కొండా దంపతులు వైఎస్ జగన్ వెంట నడిచారు. వైఎస్ జగన్ ను సీఎం చేయాలని పట్టుబట్టిన వారిలో కొండా సురేఖ దంపతులు కూడా ముందు వరుసలో ఉంటారు. అలాంటి సమయంలో వైఎస్ఆర్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టి వైఎస్ జగన్ ను వేధిస్తున్న క్రమంలో, వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోయి కొత్త పార్టీ స్థాపించే సమయంలో కొండా సురేఖ తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి వైఎస్ జగన్ వెంట నడిచింది. ఆ సమయంలో వచ్చిన బై ఎలక్షన్స్ లో కొండా సురేఖ వైసిపి పార్టీ నుంచి నిలబడి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఆ సమయంలో తెలంగాణాలో ఉద్యమం నివురు గప్పిన నిప్పులా ఉంది. కానీ వైఎస్ఆర్  పార్టీ నుంచి నిలబడి అన్ని ఓట్లు సాధించగలిగింది అంటే, అక్కడ కొండా దంపతుల ఛరిష్మాతో పాటు, వైఎస్ అభిమానులు అండగా నిలిచారు.

వైఎస్ జగన్ సమైక్యాంద్రకు జై కొట్టడంతో కొండా దంపతులు వైఎస్ఆర్ సీపీకి దూరమయ్యారు. కానీ కొండా దంపతులు పార్టీకి దూరమైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తమ అభిమానాన్ని అలానే కొనసాగించారు. ఇక 2014 ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొండా సురేఖ వరంగల్ తూర్పు స్థానం నుంచి పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొండా సురేఖకు మంత్రి పదవి ఖాయమని అందరూ భావించినా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలించిన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు ఒక్క మహిళను కూడా తన మంత్రి వర్గంలోకి తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపారు.

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తరువాత వెంటనే తెలంగాణాలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లలో 105 సీట్లకు అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. కానీ ఈ అభ్యర్థుల ఎంపికలో కొండా సురేఖ అసెంబ్లీ స్థానమైన వరంగల్ తూర్పు స్థానాన్ని పెండింగ్ లో పెట్టడం విశేషం. దీనిపై కొండా దంపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్, కేటీఆర్ పై పలు విమర్శలు చేశారు. తాము అవసరమైతే ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచే సత్తా ఉందని తెలియచేసారు.

కొండా దంపతులకు వరంగల్ లో ప్రత్యేక ఓట్ బ్యాంకు ఉంది. కొండా మురళి, కొండా సురేఖ ఎప్పుడూ ప్రజలలో ఉండటంతో వారిపై వరంగల్ ప్రజలకు ప్రత్యేక అభిమానం ఉంది. అలానే మొదటి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్గంగా గుర్తింపు పొందటంతో పాటు, వైఎస్ చనిపోయిన తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై జరుగుతున్న కుట్రను కూడా తట్టుకోలేక కాంగ్రెస్ నుంచి బయటకు రావడం కూడా వైఎస్ అభిమానులలో కొండా దంపతులకు ప్రత్యేక స్థానం ఉంది. టిఆర్ఎస్ నుంచి కొండా దంపతులు బయటకు వచ్చి తిరిగి ఈనెల 12న కాంగ్రెస్ లో చేరుతారన్న వార్తలతో కాంగ్రెస్ పార్టీ కొండా దంపతులకు వరంగల్ తూర్పు, పరకాల టికెట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ స్థానాలలో కొండా సురేఖతో పాటు, కొండా సురేఖ కూతురు సుష్మితను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.

కాంగ్రెస్ లోకి కొండా దంపతులు తిరిగి రావడంతో వరంగల్ లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని, కొండా దంపతులకున్న ప్రత్యేక ఓట్ బ్యాంకు తో పాటు, వైఎస్ ను అభిమానించే అభిమానులు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ గంపెడాశలతో ఉంది. ఇప్పటికే కొండా దంపతులకే మా సపోర్ట్ అని సోషల్ మీడియా వేదికగా వైఎస్ రాజశేకర రెడ్డి అభిమానులు ప్రకటించడం విశేషం. చూద్దాం రాబోయే రోజులలో కొండా దంపతులు పాత గూటికి చేరి వరంగల్ జిల్లాలో ఏవిధంగా సత్తా చూపుతారో త్వరలో జరిగే ఎన్నికలలో తేలనుంది.