Thursday, November 7, 2024

హ్యాట్రిక్ విజయంపై భారత్ కన్ను

- Advertisement -

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రసవత్తర పోరు…పెర్త్ లాంటి పేస్ పిచ్ పై టీమిండియా సఫారీలతో తలపడబోతోంది. గ్రూప్ లో టాప్ ప్లేస్ లో కొనసాగడమే లక్ష్యంగా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
అన్ని విభాగాల్లోనూ ఫామ్‌లో ఉన్న టీమిండియాకు సఫారీ జట్టు నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీఫైనల్‌కు మరింత చేరువవ్వాలని భావిస్తోంది. ఈ టోర్నీలో అంచనాలకు తగ్గట్టే రాణిస్తోంది భారత్‌.. తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఉత్కంఠ పోరులో గెలిచిన రోహిత్‌సేన తర్వాత నెదర్లాండ్స్‌పై గ్రాండ్ విక్టరీ అందుకుంది. రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌ అడ్వాంటేజ్‌గా చెప్పాలి. అదే సమయంలో కెఎల్ రాహుల్ వరుస వైఫల్యాలను నిరాశ కలిగిస్తున్నా సఫారీ జట్టుపై అతను కూడా గాడిన పడాలని టీమ్ కోరుకుంటోంది. హార్ఠిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ కీలకం కానున్నారు. అటు బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణిస్తుండడం కూడా అడ్వాంటేజ్‌. ముఖ్యంగా పెర్త్‌ పిచ్‌పై పేసర్లదే ఆధిపత్యమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో భువితో పాటు హర్షల్ పటేల్, అర్షదీప్‌సింగ్‌లపై మరోసారి అంచనాలున్నాయి. స్పిన్ విభాగంలో అశ్విన్, అక్షర్ పటేల్ కొనసాగనున్నారు. సఫారీ జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండడంతో అశ్విన్‌ వైపే టీమ్ మొగ్గుచూపుతోంది.
మరోవైపు సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకమనే చెప్పాలి. జింబాబ్వేతో గెలిచే మ్యాచ్ వర్షంతో రద్దవడం, పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారకుండా ఉండాలంటే భారత్‌పై విజయం సఫారీలకు తప్పనసరి కానుంది. బంగ్లాదేశ్‌పై భారీ విజయం సౌతాఫ్రికా కాన్ఫిడెన్స్ పెంచింది. వన్ డౌన్ బ్యాటర్ రొస్కో సెంచరీతో మెరవడం, డికాక్ ఫామ్‌ సఫారీ టీమ్‌కు కలిసొచ్చే అంశం. అలాగే దక్షిణాఫ్రికా పేస్ ఎటాక్‌ ఫామ్‌లో ఉండడం కూడా వారికి అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. పెర్త్ పిచ్‌పై తమ పేస్ ఎటాక్‌తోనే టీమిండియాను దెబ్బతీస్తామని సఫారీ టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉంది. మరోవైపు ఈ ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వరుణుడు భారత్‌, సౌతాఫ్రికా మ్యాచ్‌కు అడ్డుపడే అవకాశాలు లేవని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!